వచ్చే ఎన్నికల్లో అక్కడ ఒక్క ఓటు తగ్గినా రాజకీయాలను వదిలేస్తా : ఉత్తమ్ కుమార్ రెడ్డి
తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతో నిస్వార్థంగా పని చేశానని చెబుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, తాము విలువలు, విశ్వసనీయతలతో రాజకీయాలు చేశామని పేర్కొన్నారు. 1994వ సంవత్సరం నుంచి రాజకీయాలు చేస్తున్నా కనీసం సొంత ఇల్లు కూడా తమకు లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తమకు పిల్లలు లేరని కోదాడ, హుజుర్ నగర్ నియోజకవర్గ ప్రజలను తమ పిల్లలుగా భావిస్తూ వారి కోసమే పని చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో అరాచకాలు పెరిగిపోయాయని పేర్కొన్న ఆయన వచ్చే ఎన్నికలలో కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో 50 వేల మెజారిటీ కి ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాలను వదిలేస్తానని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ నియోజక వర్గాల్లో 50 వేల ఓట్ల మెజారిటీ.. ఒక్క ఓటు తగ్గినా సరే ..
రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికలను కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో 50 వేల మెజారిటీ వచ్చి తీరుతుందని, తాము గెలవడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. తాను చెప్పిన మెజారిటీకి ఒక్క ఓటు తగ్గిన రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని, తనకు పదవులు, ఆస్తులపై వ్యామోహం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలోనే అత్యున్నతమైన ఉద్యోగాన్ని త్యాగం చేసి తాను రాజకీయాల్లోకి వచ్చానని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.

పొయ్యేకాలం వస్తే అధికారుల పనితీరు కూడా ఇలాగే ఉంటుంది
పదవిలో లేకున్నా ప్రజల అభివృద్ధి కోసం తాను పాటు పడుతున్నానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో అధికారులు కూడా సరిగా ప్రవర్తించటం లేదని, పోయేకాలం వచ్చినప్పుడు ఇలాగే ప్రవర్తిస్తారు అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలు నిశ్శబ్దంగా గమనిస్తున్నారని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి త్వరలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.
కొందరు తనపై కావాలని దుష్ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. తాను ఐదుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా, టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పని చేశానని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.