
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై బండి సంజయ్ ఆగ్రహం
కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ విషయంలో ప్రభుత్వ వైఖరిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ మూర్ఖ వైఖరికి ఒక రైతు బలికావడం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. కామారెడ్డి జిల్లా అడ్లూర్ ఎల్లారెడ్డి కి చెందిన రైతు పయ్యావుల రాములుది ఆత్మహత్య కాదు అది ప్రభుత్వహత్య అని పేర్కొన్న బండి సంజయ్ నిన్న రైతు మృతదేహం తరలింపు విషయంలో కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు.

భవిష్యత్ లో జరిగే పరిణామాలకు అధికారులదే బాధ్యత
కలెక్టర్, పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన బండి సంజయ్ టిఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతమని జిల్లా అధికార యంత్రాంగం భావించకూడదని ఆయన గుర్తు చేశారు. అధికారులు చట్టబద్దంగా వ్యవహరించకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. గత నెల రోజులుగా ఆందోళన చేస్తున్న రైతులు కలెక్టర్ ను కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వెళితే పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు.

రైతులు ఉగ్రవాదులా.. సంఘ విద్రోహ శక్తులా?
బారికేడ్లు, కంచె వేసి రైతులను అడ్డుకోవడం సిగ్గుచేటని, రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఉగ్రవాదులుగా, సంఘ విద్రోహ శక్తులుగా పరిగణిస్తోంది అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పట్టణానికి మాస్టర్ ప్లాన్ అవసరం అనుకున్నప్పుడు ముందుగా ప్రభుత్వ భూములను, బీడుబడిన భూములను సేకరించాలి కానీ చక్కగా పంటలు పండే రైతులు వ్యవసాయ భూములు లాక్కోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వంలో సీఎం ఎవరినీ కలిసే తీరిక లేదని, కనీసం జిల్లా కలెక్టర్లకు కూడా రైతులకు కలిసి తీరిక లేకుండా పోయిందని కామారెడ్డి కలెక్టర్ తీరును బండి సంజయ్ ఎండగట్టారు.

కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ మార్పులు చెయ్యకుండా మూర్ఖంగా వెళ్తే నష్టం
ఇప్పటికైనా వెంటనే కామారెడ్డి జిల్లా కలెక్టర్ తో పాటు, రాష్ట్ర మంత్రులు రైతులతో చర్చలు జరగాలన్నారు. రైతులు సూచించిన మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్లో మార్పులు చేయాలని ఆయన పేర్కొన్నారు. మాస్టర్ ప్లాన్ మార్చకుండా ఇలానే మూర్ఖంగా ముందుకు వెళితే జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ఉపసంహరించుకోవాలని రైతులు చేపట్టే ఆందోళనకు బిజెపి మద్దతు కొనసాగుతుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.