ఈ ఇద్దరితో మూడో పార్టీ కలుస్తుంది…
ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల పైన స్పందిస్తున్న వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో తెలుగుదేశం, జనసేన పార్టీల కలయిక ఓ ప్రభంజనంగా పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలకు మూడో పార్టీ కూడా జత కలుస్తుందంటూ పరోక్షంగా బీజేపీ గురించి ప్రస్తావించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ అనంతరం తమ పార్టీ నాయకులు ఎంతగా ఉలిక్కిపడ్డారో, అలాగే గతంలోనూ తమ పార్టీ నేతల ప్యాంట్లు తడిసిపోయాయని రఘురామ ఎద్దేవా చేసారు. ఇప్పటికే బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతోంది. కానీ, అది నామ్ వే వాస్తే అన్నట్లుగానే ఉంది. టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ నేతలు మాత్రం ప్రసక్తే లేదని చెబుతున్నారు. అయితే, బీజేపీ అధినాయకత్వం నుంచి స్పష్టత వచ్చే వరకూ వేచి చూసే ధోరణితో చంద్రబాబు – పవన్ ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

పవన్ ఇక టీడీపీతోనే.. బీజేపీ డిసైడ్ అయిందా
తాజాగా చంద్రబాబు – పవన్ భేటీ పైన బీజేపీ నేతలు పెద్దగా రియాక్ట్ కాలేదు. కొందరు నేతలు గతంలో విశాఖలో పవన్ పర్యటన సమయంలో చోటు చేసుకున్న పరిణామాలతో చంద్రబాబు జనసేనానికి సంఘీభావం ప్రకటించారని..ఇప్పుడు కుప్పం పర్యటన తరువాత చంద్రబాబుకు పవన్ మద్దతుగా నిలిచారని విశ్లేషిస్తున్నారు. కానీ, విశాఖలో ప్రధానితో పవన్ భేటీ తరువాత టీడీపీతో జనసేనాని కలవరనే ప్రచారం సాగింది. ఇప్పటికీ టీడీపీతో తమ పొత్తు ఉంటుందని పవన్ అధికారికంగా ప్రకటన చేయటం లేదు. కానీ, పవన్ సమక్షంలోనే చంద్రబాబు తమ పొత్తు పైన స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. ఎన్నికల వేళ పొత్తుల పైన నిర్ణయాలు ఉంటాయని.. తమ వ్యూహాలు తమకు ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు.

వైసీపీ ధీమా – పొత్తుల రాజకీయం
వైసీపీ నేతలు చాలా కాలంగా టీడీపీ – జనసేన పొత్తు ఖాయమని చెప్పుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు – పవన్ భేటీ తమకు ఆశ్చర్యంగా లేదని చెబుతున్నారు. వారిద్దరూ ఎప్పుడూ టచ్ లోనే ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇక..ఇప్పుడు బీజేపీ అధినాయకత్వం ఏం చేస్తుందనేది కీలకంగా మారుతోంది. తెలంగాణలో అధికారం లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీకి అక్కడ సహకరించి.. ఏపీలో మద్దతు పొందాలనేది టీడీపీ – జనసేన వ్యూహం. కానీ, తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం ఈ రెండు పార్టీలతో పొత్తు వద్దంటూ హైకమాండ్ కు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకత్వం ఈ రెండు పార్టీలతో కలిసి రాజకీయ ప్రయాణం పైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయంలో కీలకం కానుంది.