ఏపీ రాజకీయాల కోసం కేసీఆర్ వ్యూహాలు.. చంద్రబాబు వ్యూహాల లానే..
తెలంగాణా సీఎం కేసీఆర్ ఏపీలో రాజకీయాలను చెయ్యటం కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఆయన అనుసరిస్తున్న వ్యూహాలు చంద్రబాబు వ్యూహాలలానే ఉండటం చర్చనీయంశంగా మారింది. గతంలో చంద్రబాబు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై పోరు ప్రకటించి జాతీయ పార్టీగా టీడీపీని యఎర్పాటు చేసి రాజకీయాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే కోవలో కేసీఆర్ కూడా ముందుకు సాగుతున్నారు. ఇక అంతేకాదు చాలా విషయాల్లో సీఎం కేసీఆర్ చంద్రబాబును ఫాలో అవుతున్నారు.

చంద్రబాబు బాటలో పయనిస్తున్న కేసీఆర్
గతంలో ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రాగా తెలంగాణలో పోటీ చేయడం కోసం చంద్రబాబు ఇంటెలిజెన్స్ ను రంగంలోకి దించారని అప్పట్లో చర్చ జరిగింది. ఆ సమయంలో ఏపీ ఇంటిలిజెన్స్ బృందాలు తెలంగాణ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి ప్రజాభిప్రాయం ఏవిధంగా ఉన్నదన్న దానిపై ఆరా తీశాయి. ఇక ఈ వ్యవహారం అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ దుమారం రేపింది. అయితే ప్రస్తుతం చంద్రబాబు బాటలోనే పయనిస్తున్న కేసీఆర్ అదే పని ఇప్పుడు ఏపీలో కూడా చేస్తున్నట్టు సమాచారం .

ఏపీలో తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలు?
ఏపీ రాజకీయాల్లో చక్రం తిప్పడం కోసం వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్నది అంచనా వేయడం కోసం ఏపీలో తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలను రంగంలోకి దించి ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇంటిలిజెన్స్ పోలీసులను ఏపీలో పరిస్థితిని అధ్యయనం చేయడానికి కెసిఆర్ పంపించినట్లు గా తెలంగాణలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు, చింతల పార్థసారథి వంటి నేతలు చేరడంతో ఏపీ రాజకీయాల పై ఫోకస్ పెట్టిన కేసీఆర్ అక్కడ పరిస్థితి అంచనా వేయడానికి ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

ఏపీలో ఈ అంశాలపైనే అభిప్రాయ సేకరణ
కనీసం పదికిపైగా ఇంటెలిజెన్స్ బృందాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తూ ఏపీలో బిఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అన్న అంచనాలను సీఎం కేసీఆర్ కు నివేదించినట్లు సమాచారం. ముఖ్యంగా తెలంగాణా ఇంటిలిజెన్స్ బృందాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత పరిపాలన ఏ విధంగా ఉంది? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అభివృద్ధి పైన సంక్షేమ పథకాల పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు? ఏ వర్గాన్ని నమ్ముకుంటే ఓటు బ్యాంకు బలంగా ఉంటుంది? ఏపీలో ప్రధానమైన ఓటుబ్యాంకు ఏ సామాజిక వర్గానిది? వంటి అనేక అంశాలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

ఏపీ ప్రభుత్వం తెలంగాణా ఇంటిలిజెన్స్ వర్గాలను అడ్డుకుంటుందా?
అయితే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు పాలన సమయంలో, తెలంగాణలో గత ఎన్నికలకు ముందు ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో ఆరా తీస్తే తెలంగాణ ప్రభుత్వం అడ్డుకుంది. మరి ప్రస్తుతం ఏపీలో తెలంగాణ ఇంటెలిజెన్స్ అధికారులు రంగంలోకి దిగితే ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందా? లేదా అన్నది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఆసక్తికర చర్చకు కారణం గా మారింది.