దేశ్ కీ నేత అనిపించుకునే ప్రయత్నం చేసిన కేసీఆర్
దేశం దృష్టిని తెలంగాణ రాష్ట్రం మీదికి మళ్లే విధంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఐదు లక్షల మంది జన సమీకరణతో అత్యంత అట్టహాసంగా ఖమ్మంలో బిఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించారు. కేసీఆర్ నిర్వహించిన ఈ సభకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత మాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సభా వేదికగా దేశ రాజకీయాలపై ఎక్కుపెట్టిన కేసీఆర్ తాను దేశ్ కి నేత అనిపించుకునే ప్రయత్నం చేశారు.

కేసీఆర్ సభతో బీఆర్ఎస్ కు దేశ వ్యాప్త ప్రచారం
బీఆర్ఎస్ పార్టీకి దేశవ్యాప్తంగా ప్రచారం తీసుకురావడం కోసం ఆయన ఖమ్మం వేదికగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. బిజెపిని గద్దె దించాలని పిలుపునిచ్చారు. ఆయనతోపాటు, బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి కూడా బిజెపి పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇక ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సభలో పాల్గొనడంతో కెసిఆర్ కు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి దేశవ్యాప్త ప్రచారం దొరికినట్టయ్యింది.

తెలంగాణా ప్రజల మద్దతు కోసం కేసీఆర్ వ్యూహం
కెసిఆర్ ఖమ్మం సభ వేదికగా టార్గెట్ చేసిన మరొక ముఖ్యమైన అంశం తెలంగాణ రాష్ట్రంలో మరోమారు అధికారం. ఇప్పటికే రెండు దఫాలుగా తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్ కు పట్టం కడుతూ వచ్చారు. ఇప్పుడు మూడో దఫా కూడా కేసీఆర్ కు పట్టం కట్టాలని, జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని బయలుదేరిన వేళ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి తెలంగాణలో అధికారాన్ని కట్టబెడితే, తాను దేశ రాజకీయాలు చేయడానికి అవకాశం ఉంటుందని, మోడీ సర్కార్ పై పోరాటం చేయడానికి తనకు ప్రజల మద్దతు కావాలని తెలియజెప్పే ప్రయత్నం చేశారు.

తెలంగాణాలో అధికారమే లక్ష్యం
అంతిమ లక్ష్యం మాత్రం తెలంగాణ రాష్ట్రంలో మరో మారు బి ఆర్ ఎస్ అధికారంలోకి రావడమే అన్నది గమనార్హం. ఇక రెండో లక్ష్యాన్ని చేరుకోవడంలో, ప్రజలను ప్రభావితం చేయడంలో కెసిఆర్ ఏ మేరకు సక్సెస్ అయ్యారు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై ఫోకస్ చేస్తున్న వేళ తెలంగాణ ప్రజలు ఆయనకు మద్దతుగా రాష్ట్రంలో మళ్లీ అధికారం కట్టబెడతారా? అన్నది మాత్రం ప్రస్తుతానికి ప్రశ్న. కానీ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలలో భావోద్వేగం రగిలించడంలో మాత్రం తన వంతు ప్రయత్నం చేశారు.

ఖమ్మం రాజకీయాలలో పట్టుకు యత్నం
ఇక ఖమ్మం సభ వేదికగా కెసిఆర్ టార్గెట్ చేసిన మరొక ముఖ్యమైన అంశం ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ బలోపేతం. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి బలహీనంగా ఉంది. పార్టీలో అంతర్గత కలహాలు పార్టీకి ఊపిరాడనివ్వడం లేదు. నేతల మధ్య సమన్వయలేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉన్న పార్టీని, ఏకతాటి మీదకు తీసుకురావడానికి ఖమ్మం సభ కేంద్రంగా సీఎం కేసీఆర్ గట్టి ప్రయత్నమే చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడానికి కెసిఆర్ ఈ సభ ద్వారా ప్రయత్నం చేశారు. ఖమ్మంలో పార్టీ బలోపేతమై, మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం కోసం, ఖమ్మం జిల్లాకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు కెసిఆర్ అక్కడే బిఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించారు. మరి ఖమ్మం రాజకీయాలలో బిఆర్ఎస్ పార్టీకి పట్టు కోసం కేసీఆర్ చేసిన ప్రయత్నం తాలూకా రిజల్ట్ కూడా ముందు ముందు తెలియనుంది.

ఒక్క దెబ్బకు మూడు పిట్టలు … కేసీఆర్ ఖమ్మం మీటింగ్ ప్లాన్ సక్సెస్ అయినట్టేనా?
ఏది ఏమైనా ఒక్క దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టు కెసిఆర్ ఖమ్మం సభతో ఆసక్తికరమైన రాజకీయం చేశారు. ఒకపక్క దేశ రాజకీయాలపై ఫోకస్ చేస్తూనే, మరోపక్క స్వరాష్ట్రంలో మళ్ళీ పాగా వెయ్యటం కోసం సెంటిమెంట్ రగిల్చే యత్నం చేశారు. ఇంకో వైపు పార్టీని బలోపేతం చెయ్యటంపై కూడా దృష్టి సారించారు. ఇక ఆయన ఆశించిన ఫలితాలు వస్తాయో లేదో మాత్రం భవిష్యత్తు నిర్ణయిస్తుంది.