కొనసాగుతున్న కామారెడ్డి బంద్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు తలపెట్టిన కామారెడ్డి బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.గురువారం కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట రాత్రి 9 గంటల వరకురైతులు కుటుంబ సమేతంగా ధర్నాలు చేసినా, కలెక్టరేట్ ముట్టడి రణరంగాన్ని తలపించినా కలెక్టర్ రైతుల వద్దకు రాకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు కామారెడ్డి నియోజకవర్గ బంద్‌కు రైతు జేఏసీ పిలుపునిచ్చింది. రైతుల సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినా కలెక్టర్ రైతులను కలవకపోవడంతో కలెక్టర్ తీరుపై రైతులు తీవ్ర అసహనంతో ఉన్నారు. దీంతో నేడు బంద్ ప్రకటించగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది.

కామారెడ్డిలో కాటిపల్లి వెంకట రమణారెడ్డి హౌస్ అరెస్ట్.. ప్రతిపక్ష పార్టీ నేతల అరెస్ట్ ల పర్వం
ఇక కామారెడ్డి రైతులు చేస్తున్న ఆందోళనకు ప్రతిపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇక నేడు రైతు ఐక్యకార్యాచరణ కమిటీ బంద్ కు పిలుపునిచ్చిన క్రమంలో ఈ ఉదయం 5 గంటల నుంచి పోలీసులు వివిధ పార్టీల నాయకుల ఇళ్ల వద్దకు చేరుకుని అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారు. బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇన్ ఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. రమణారెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే బీజేపీకి చెందిన ముఖ్య నాయకులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు.

రైతుల పోరాటానికి బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్‌టీపీ మద్దతు
ఇండస్ర్టీయల్ జోన్‌లో డ్రాప్ట్ ప్లాన్‌లో వ్యవసాయ భూములు కోల్పోతున్న రైతులకు మద్దతుగా జేఏసీ ఇచ్చిన పిలుపునకు బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్‌టీపీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. టి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రైతులకు మద్దతుగా నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. రైతులు చేపట్టిన ఆందోళనకు మొదటి నుంచి బీజేపీ మద్దతుగా నిలుస్తోంది. నిన్న రైతుల ధర్నాపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. వెంటనే రైతులతో చర్చించి మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

కామారెడ్డిలో కళాశాలలు, స్కూళ్ళు బంద్.. రైతుల పోరాటానికి మద్దతు
ఈరోజు రైతులకు మద్దతుగా ఆయన కామారెడ్డికి రానున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం బుదవారం అత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాన్ని అదుకోవాలని, మాస్టర్ ప్లాన్ రద్ధు చేయాలని కోరారు. రైతులకు మద్ధతుగా కామారెడ్డిలోని పలు ప్రైవేట్ కళాశాలలు, పాఠశాలలు బంద్‌కు మద్దతు తెలిపాయి. ఇప్పటికే కళాశాలలు, పాఠశాలలకు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించాయి. రైతుల ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని తెలిపారు.పోలీసులు నిరసనలను ముందస్తుగా కట్టడి చేస్తున్నారు.
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రగడ: కేసీఆర్ స్పందించాలి: రేవంత్ రెడ్డి లేఖ!!