కాపు ఓటర్ల కోసం హోరాహోరీ పోరు
ప్రస్తుతం రాష్ట్రంలో కాపు ఓట్ల కోసం ఈ రెండు పార్టీల మధ్య పోరు నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో కాపు ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతారని చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అంచనా వేస్తున్నారు. పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకుంటే వైసీపీ సులువుగా ఓడించవచ్చని బాబు భావిస్తున్నారు. అందుకు కేంద్రంలోని బీజేపీ మద్దతు కూడా కోరుతున్నారు. విశాఖపట్నంలో జరిగిన కాపునాడుకు వైసీపీ మినహా అన్ని పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈసారి కాపులకు ముఖ్యమంత్రి పదవి అనే కాన్సెప్ట్ తో కాపు నేతలు ముందుకు వెళుతున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కోసం ఈ నేతలు పనిచేస్తున్నారు.

తెరపైకి వచ్చిన బలిజ వర్గం
ఏపీలో కాపు రాజకీయం వేడెక్కడంతో అదే కేటగిరిలో ఉండే బలిజ వర్గం తెరపైకి వచ్చింది. కాపులు, బలిజలు, తూర్పు కాపు, తెలగ, ఒంటరి… ఇలా కొన్ని కులాలన్నీ కలిపి ఒకే తెగ కిందకు వస్తాయి. అయితే ఇందులో కాపుల డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. రాయలసీమలో బలిజలు అధికంగా నివసిస్తున్నారు. కాపు రాజకీయాల్లో బలిజలకు ప్రాధాన్యత ఉండటంలేదంటూ ఆ వర్గానికి చెందిన నేతలు నిరసన గళం వినిపిస్తున్నారు. కాపులు రాష్ట్రవ్యాప్తంగా 28 శాతం ఉన్నారని, అందులో బలిజలు 14 శాతం ఉంటారని, వారిని ఎవరూ గుర్తించడంలేదంటూ వాపోతున్నారు.

కాపు, బలిజల మధ్య చిచ్చు పెట్టే రాజకీయ క్రీడ
కాపు నేతల నాయకత్వంలోనే తాము పనిచేసినా తమ గురించి ఎవరూ మాట్లాడిన సందర్భాలే లేవని, ఎన్టీఆర్ ఒక్కరే బలిజలను గుర్తించారంటున్నారు. వైఎస్ కూడా కాపులను గుర్తించారని, తర్వాత తమను గుర్తిస్తారనుకున్నామని కానీ తమను ఎవరూ గుర్తించడంలేదన్నారు. కాపు, బలిజ కలిస్తేనే బలమన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలో బలిజలను తాము ఎప్పుడూ తక్కువ చేయలేదని అందరం ఒకటేనని త్రిమూర్తులు ప్రకటించారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో రకరకాల పేర్లతో ఉన్నప్పటికీ అందరూ కాపులేనని ప్రకటించారు. ప్రస్తుత పరిణామాల్లో కాపు ఓటర్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ గా మారడంతో కాపులు, బలిజల మధ్య చిచ్చు పెట్టేలా రాజకీయ క్రీడ ప్రారంభమైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.