జనసేన నుంచి నానికి తీవ్ర సెగ
కొడాలి నానికి జనసేన పార్టీ నుంచే తీవ్ర సెగ తగలబోతోందని, చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్నా, అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తున్నా అలా మాట్లాడటం ఇష్టం లేకే టీడీపీ నేతలు మౌనం వహిస్తున్నారని చెబుతారు. గుడివాడ నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ కు అభిమానులు ఎక్కువ. యువతలో మంచి క్రేజ్ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు పొడిస్తే ఆ సీటును జనసేనకే వదిలిపెట్టే అవకాశాలున్నాయంటూ తాజాగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

నాని వరుసగా గెలవడానికి టీడీపీయే కారణం?
గుడివాడ నియోజకవర్గం నుంచి నాని వరుసగా గెలవడానికి తెలుగుదేశం పార్టీయే కారణం అని పట్టణంలోని తెలుగు తమ్ముళ్ల అభిప్రాయం. ఒకే అభ్యర్థిని నిలబెట్టకుండా ప్రతి ఎన్నికకు అభ్యర్థిని మారుస్తుండటం నానికి కలిసివస్తోంది. నానికి ముఖ్య అనుచరులుగా ఉన్న పాలంకి సారధిబాబు, పాలంకి మోహన్‌బాబు ఇటీవలే జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీలో చేరారు. నాని ఇటీవల కాలంలో మరీ శ్రుతి మించి మాట్లాడుతున్నారని, అందుకే తాము పార్టీ మారుతున్నట్లు కారణాన్ని వెల్లడించారు.

ఇంటిని చుట్టుముట్టినా నాని మౌనం
కొద్దిరోజులుగా పట్టణంలో జనసేన హవా పెరుగుతోంది. రహదారులు బాగోలేదంటూ కొడాలి ఇంటిని జనసేన శ్రేణులు ఇటీవలే చుట్టుముట్టే ప్రయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వైసీపీ ఇచ్చిన హామీలు, గుడివాడలో కొడాలి నాని ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరాయనేదానిపై జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే నాని జనసేనపై అలా విరుచుకుపడలేకపోతున్నారు. ఓటింగ్ నమోదయ్యేది ఎక్కువగా యువత నుంచి కావడం, వారంతా పవన్ కల్యాణ్ అభిమానులు కావడంతో ప్రస్తుతానికి ఆయన మౌనం వహించారు. జనసేనానిపై విమర్శలు ఎక్కుపెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

జనసేనే సరైన ప్రత్యర్థి అంటున్న విశ్లేషకులు
కొడాలి నానిని జనసేన టార్గెట్ చేసింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో ని ప్రజలు చెత్త పన్నుపై కొడాలిని నిలదీయడంతో ఆయన పేర్ని నానితో కలిసి ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. జనసేన ద్వారా కొడాలి నానిని టీడీపీ గట్టిగా టార్గెట్ చేసిందంటున్నారు. భవిష్యత్తు పరిణామాలు ఎటువంటి మలుపులు తిరుగుతాయో తెలుసుకోవాలంటే కొద్దిరోజులు ఎదురు చూడక తప్పేలా లేదు.