కోడికత్తి కేసులో కీలక పరిణామాలు- శ్రీనుకు బెయిల్ తిరస్కరణ-జగన్ కోర్టుకు రావాల్సిందే.. !
కోడి కత్తి కేసులో ఎన్ఐఏ కోర్టు విచారణ

కోడి కత్తి కేసులో ఎన్ఐఏ కోర్టు విచారణ

2019లో వైజాగ్ ఎయిర్ పోర్టులో అప్పటి విపక్ష నేత వైఎస్ జగన్ పై కోడి కత్తితో జనిపల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. పాదయాత్ర చేసుకుని హైదరాబాద్ కు తిరిగి వెళ్తున్న జగన్ పై శ్రీనివాస్ చేసిన దాడిలో ఆయన భుజానికి గాయమైంది. దీంతో జగన్… వైజాగ్ లో ప్రాథమిక చికిత్స చేయించుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో ఈ కేసును కోర్టు ఎన్ఐఏకు అప్పగించింది. దీంతో ఎన్ఐఏ అప్పటి నుంచి దర్యాప్తుచేస్తోంది. నిందితుడు జనిపల్లి శ్రీనివాస్ కూడా జైల్లో రిమాండ్ ఖైదీగానే ఉన్నాడు. ఈ కేసులో జనిపల్లి శ్రీనివాస్ కు బెయిల్ కోరుతూ అతని కుటుంబ సభ్యులు దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు.. ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది.

కోడికత్తి శ్రీను బెయిల్ తిరస్కరణ

కోడికత్తి శ్రీను బెయిల్ తిరస్కరణ

వైఎస్ జగన్ పై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్ బెయిల్ కోసం చేసుకున్న అభ్యర్ధనను విజయవాడ ఎన్ఐఏ కోర్టు ఇవాళ తోసిపుచ్చింది. ఆయనకు బెయిల్ ఇవ్వరాదని నిర్ణయించింది. వాస్తవానికి జగన్ పై కోడి కత్తితో దాడి తర్వాత అరెస్టైన శ్రీను..అప్పటి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే క్రమంలో బాధితుడిగా ఉన్న వైఎస్ జగన్ నుంచి నిరభ్యంతర పత్రం కోసం శ్రీను తల్లితండ్రులు సీఎం క్యాంపు కార్యాలయానికి కూడా వచ్చారు. సీఎం జగన్ నుంచి ఎన్వోసీ తీసుకుని బెయిల్ దరఖాస్తు చేసినా వారికి ఆశాభంగం తప్పలేదు.
జగన్ ను రావాల్సిందేనన్న ఎన్ఐఏ కోర్టు

జగన్ ను రావాల్సిందేనన్న ఎన్ఐఏ కోర్టు

ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ కోర్టుకు రావాలని కూడా ఎన్ఐఏ కోర్టు ఇవాళ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో బాధితుడైన జగన్ ఇప్పటివరకూ కోర్టుకు రాకపోవడంపై న్యాయస్ధానం అభ్యంతరం తెలిపింది. అలాగే కోర్టు ఇక్కడ టేప్ రికార్డర్ లా వ్యవహరించబోదని కూడా తెలిపింది. ఈ కేసులో బాధితుడిని ఇవాళ్టి వరకూ ఎందుకు విచారించలేదని నిందితుడి తరపు న్యాయవాది సలీమ్ ప్రశ్నించారు. సమాధానంగా స్టేట్‌మెంట్ రికార్డు చేశామని ఎన్‌ఐఏ న్యాయవాది చెప్పారు. రికార్డు చేస్తే చార్జ్‌షీట్‌లో ఎందుకు లేదని న్యాయమూర్తి ప్రశ్నించారు. బాధితుడిని విచారించకుండా మిగతా సాక్షులను.. విచారించి ఉపయోగం ఏముందని కోర్టు వ్యాఖ్యానించింది. బాధితుడిగా ఉన్న సీఎం కోర్టుకు రావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు.

జగన్ ను 31న హాజరుకావాలన్న కోర్టు

జగన్ ను 31న హాజరుకావాలన్న కోర్టు

కోడి కత్తి కేసులో ఎన్ఐఏ మొత్తం 56 మందిని విచారిస్తే 1 నుంచి 12 వరకూ ఉన్నవారి వాంగ్మూలాలు చార్జ్‌షీట్లో ఎందుకు లేవని ఎన్‌ఐఏ న్యాయవాదిని ఎన్ఐఏ కోర్టు ప్రశ్నించింది. దీంతో ఆయన వద్ద సమాధానం లేదు. దీంతో
ఈనెల 31వ తేదీ నుంచి విచారణకు ఎన్ఐఏ కోర్టు షెడ్యూల్ ప్రకటించింది. దీని ప్రకారం కోర్టుకు బాధితుడు వైఎస్ జగన్ సహా మిగతా వారంతా తప్పనిసరిగా హాజరుకావాలని జడ్డి స్పష్టం చేశారు. దీంతో ఎన్నికలకు ముందు కోడి కత్తి వ్యవహారం ఎలాంటి మలుపులు తీసుకోనుందన్న ఉత్కంఠ నెలకొంది.

Source link

Spread the love

Leave a Comment