ఠాక్రే తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ
తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే తో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ అయ్యారు. గాంధీ భవన్ కు రావాలంటూ బుధవారం స్వయంగా ఠాక్రే ఎంపీ కోమటిరెడ్డికి ఫోన్ చేసారు. తాను గాంధీ భవన్ కు రాలేనని.. బయట కలుస్తానని వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఈ రోజు ఠాక్రేతో కోమటిరెడ్డి సుదీర్ఘంగా భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. ప్రధానంగా రేవంత్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు..ఎవరినీ కలుపుకుపోవటం లేదని ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పార్టీ కమిటీల్లోనూ తనతో పాటుగా టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చారని చెప్పినట్లుగా తెలుస్తోంది.

రేవంత్ నాయకత్వంతోనే సమస్య..!
తాను ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సమావేశమైన సమయంలోనూ తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్న పరిణామాలను వివరించానని చెబుతూ మరోసారి అవే అంశాలను ఠాక్రేతో పంచుకున్నట్లుగా సమాచారం. కోమటిరెడ్డి చెప్పిన అన్ని అంశాలను విన్న ఠాక్రే కీలక హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఎన్నికల్లో పార్టీ గెలవాలంటే ఏం చేయాలి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్న సీట్లు వస్తాయి.. ప్రత్యర్ది పార్టీలను ఎదుర్కోవటంలో ఎక్కడా వెనకబడ్డామనే అంశాల పైన వీరిద్దరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది. అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని, పార్టీలో యాక్టివ్ గా ఉంటూ పని చేయాలని కొత్త ఇంఛార్జ్ ఠాక్రే ఎంపీ కోమటిరెడ్డికి స్పష్టం చేసారు. ప్రజల్లో ఉండాలి యుద్దం చేయాలని సూచించారు.

నోటీసులు చెత్త బుట్టలోకి
ఆ భేటీ తరువాత కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తుబట్టలో పడ్డాయని చెప్పుకొచ్చారు.పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనని అన్నారు. ఆరేడుసార్లు ఓడిపోయినవాళ్లున్న పీఏసీలో తాను కూర్చోవాలా అని కోమటిరెడ్డి ప్రశ్నించారు. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం తాను సూచనలు చేసినట్లు వెల్లడించారు. ఇంఛార్జ్ తో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉందన్నారు. ఇక నోటీసులు..ఫొటో మార్ఫింగ్ అంశాలు క్లోజ్ అయినట్లేనని వ్యాఖ్యానించారు. కొత్త ఇంఛార్జ్ రావటంతో కోమటిరెడ్డి తిరిగి పార్టీలో యాక్టివ్ గా ఉంటారా..లేక ఇదే తరహాలో కొనసాగుతారా అనేది చూడాల్సి ఉంది.