18న ఖమ్మంలో కేసీఆర్ భారీ సభ
ఈ నెల 12న కేసీఆర్ భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో పర్యటించనున్నారు. జిల్లాల కలెక్టరేట్లను ప్రారంభించనున్నారు. అదే సమయంలో మరోసారి ఈ నెల 18న ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు నిర్ణయించారు. బీఆర్ఎస్ తొలి సభను ఖమ్మం లో ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తొలి సభ ఢిల్లీలో నిర్వహించాలని తొలుత భావించారు. అయితే, తెలంగాణలో మారుతున్న సమీకరణాలు.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ..ఖమ్మం ను ఎంపిక చేసుకున్నారు. కొత్తగూడెం-పాల్వంచ పట్టణాల మధ్య రూ.45 కోట్లతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని, కొత్తగూడెంలో నిర్మించిన బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. దీంతోపాటు భద్రాద్రి జిల్లాకు మంజూరైన ప్రభుత్వ మెడికల్ కాలేజీ భవనానికి సీఎం శంకుస్థాపన చేయనున్నారు.

చంద్రబాబు సభ – సీనియర్ల పార్టీ మార్పు
ఖమ్మం సభ పైన సీఎం కేసీఆర్ మంత్రి పువ్వాడ అజయ్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతోపాటు వరంగల్, తదితర జిల్లాలకు చెందిన మంత్రులతో సమావేశమై చర్చించారు. మరి కొద్ది నెలల్లో తెలంగాణలో ఎన్నికలకు సిద్దమవుతున్న వేళ..బీజేపీ ఖమ్మం వేదికగా పావులు కదుపుతోంది. పొంగులేటి బీజేపీలో చేరటం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో మరో సీనియర్ నేత తుమ్మల అడుగుల పైన అనేక రకాల ప్రచారం సాగుతోంది. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఈ జిల్లాలో ఒక్క సీటు మాత్రమే గెల్చుకుంది. ఖమ్మం వేదికగా చంద్రబాబు సభ నిర్వహించారు. ఆ సభ ద్వారా తెలంగాణలో ఆదరణ తగ్గలేదని నిరూపించుకొనే ప్రయత్నం చేసారు. నిజిమాబాద్ వేదికగా మరో సభకు ప్లాన్ చేస్తున్నారు. బీజేపీతో పొత్తు కోసమే ఈ ప్రయత్నమని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ సమయంలో ఖమ్మం వేదికగానే వీటన్నింటిక సమాధానం చెబుతూ.. అసెంబ్లీ ఎన్నికలకు సమర శంఖం పూరించాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు.

జాతీయ నేతలకు ఆహ్వానం..
ఈ నెల 18న ఖమ్మంలో నిర్వహించే సభకు పలువురు సీఎంలు.. జాతీయ పార్టీల నేతలను ఆహ్వానిస్తున్నారు. ఖమ్మం సభకు ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులతోపాటు పలువురు మాజీ సీఎంలు, పలు రాష్ట్రాల్లోని బీఆర్‌ఎస్ అనుకూల పార్టీల నేతలను ఆహ్వానించనున్నారు. ఆత్మీయ సమ్మేళనాల పేరిట అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు. కేరళ ముఖ్యమంత్రి తో పాటుగా యూపీ, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, కుమార స్వామి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లక్ష్యాలను ప్రకటించటంతో పాటుగా తనను టార్గెట్ చేస్తూ జరుగుతున్న రాజకీయానికి ఖమ్మం వేదికగా కేసీర్ కౌంటర్ స్ట్రాటజీ అమలు చేయాలని నిర్ణయించారు