
కేసీఆర్ ఖమ్మం సభపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే
ఎలాంటి లక్ష్యం లేకుండా కేసీఆర్ పనిచేస్తున్నారని, 9 సంవత్సరాలుగా సెక్రటేరియట్ కు రాకుండా పరిపాలన సాగిస్తున్న వ్యక్తి కెసిఆర్ అని కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. మోడీని ఎంత విమర్శిస్తే తమకు అంత బలం, గౌరవం పెరుగుతుందని వారు భావిస్తున్నట్టుగా ఉన్నారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఖమ్మం సభలో కెసిఆర్ ఇతర ముఖ్యమంత్రుల తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మొత్తం 4500 వెల్నెస్ సెంటర్లను కేంద్రం ఇచ్చిందని, వాటి పేరు మార్చి బస్తీ దవాఖానాలుగా తామే ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారని కెసిఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు మంత్రి కిషన్ రెడ్డి.

సీఎం గానే పనికిరానోడిని.. దేశం పిలుస్తుందట
కెసిఆర్ దేశాన్ని గురించి చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని పేర్కొన్నారు. కెసిఆర్ కి దేశం మీద ప్రేమ లేదని కెసిఆర్ అంతరాత్మ తన కుటుంబం కోసమే పనిచేస్తుందని, కొడుకు సీఎం కావాలని, అధికారం చేయి జారొద్దని ఆయన ఆరాటపడుతూ ఉన్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సీఎం గానే పనికిరానోడిని.. దేశం పిలుస్తుందట అంటూ కిషన్ రెడ్డి కౌంటర్ వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో దోచుకున్నారని వ్యాఖ్యలు చేస్తున్న కిషన్ రెడ్డి గ్రామపంచాయతీలకు కేంద్రం ఇస్తున్న నిధులను కూడా దారి మళ్ళించారని గుర్తు చేశారు.

ఇండిపెండెంట్ అభ్యర్థుల వాగ్దానాల్లా కేసీఆర్ వాగ్దానాలు
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమిటో చూపించాలని సవాల్ విసిరారు. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అప్పులలో కూరుకుపోయిందని, ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థుల వాగ్దానాల మాదిరిగా కెసిఆర్ వాగ్దానాలు ఉన్నాయని కిషన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. అంతేకాదు తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గలేదని, హాస్టల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు చనిపోతున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

రాష్ట్రాన్ని దోపిడీ చేసింది చాలక దేశం మీద పడుతున్నారు
కెసిఆర్ చెబుతున్న వెలుగులు జిలుగులు కేవలం ప్రగతి భవన్, ఫామ్ హౌస్ లకు మాత్రమే పరిమితమయ్యాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని దోపిడీ చేసింది సరిపోక ఇప్పుడు దేశం మీద పడుతున్నారని విమర్శించారు. కెసిఆర్ చెబుతున్నట్టు ప్రమాదంలో ఉంది దేశం కాదని తెలంగాణ సమాజమని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికలలో కెసిఆర్ కుటుంబాన్ని ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితం చేయడం తమ ముందున్న లక్ష్యమని కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.