కుప్పంలో చంద్రబాబు టూర్
టీడీపీ అధినేత, విపక్ష నేత చంద్రబాబు కుప్పం టూర్ కు రంగం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి కుప్పంలోని మూడు మండలాల పరిధిలో చంద్రబాబు పర్యటించబోతున్నారు. అయితే తాజాగా చోటు చేసుకున్న కందుకూరు, గుంటూరు ఘటనల్ని సాకుగా చూపుతూ పోలీసులు చంద్రబాబు టూర్ కు ఆంక్షలు విధించారు. తాము సూచించిన చోటే సభలు పెట్టుకోవాలని కోరారు. రోడ్లు, జాతీయ, రాష్ట్ర రహదారులు, ఇరుకు సందుల్లో సభలు, రోడ్ షోలకు అనుమతి లేదని తేల్చిచెప్పేశారు. దీంతో ఇవాళ చంద్రబాబు టూర్ పై ఉత్కంఠ పెరుగుతోంది.

అనుమతి నిరాకరణ
కుప్పం నియోజకవర్గం పరిధిలోకి వచ్చే పలమనేరు సబ్ డివిజన్లోని మూడు మండలాల్లో చంద్రబాబు ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు పర్యటించాల్సి ఉంది. అయితే పోలీసులు ఆంక్షలు విధిస్తూ జారీ చేసిన నోటీసులపై టీడీపీ నేతలు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించినా పోలీసులు తీసుకోలేదని చెప్తున్నారు. అలాగే టీడీపీ నేతలతో పోలీసులు జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో పోలీసులు చంద్రబాబు టూర్ కు అనుమతి నిరాకరిస్తున్నట్లు రాత్రి పది గంటల సమయంలో ప్రకటించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు టూర్ కొనసాగుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.

టూర్ కొనసాగుతుందన్న టీడీపీ
పలమనేరు డీఎస్పీ ఆంక్షలు, అనుమతి నిరాకరణ నేపథ్యంలో టీడీపీ వెనక్కి తగ్గుతుందని భావించినా అలా జరగలేదు. కుప్పంలో చంద్రబాబు టూర్ కు అనుమతి కోరామని, వివరాలు కూడా ఇచ్చామని, అయినా అనుమతి నిరాకరించారని టీడీపీ ఆరోపిస్తోంది. దీంతో చంద్రబాబు టూర్ యథావిథిగా కొనసాగించాలని టీడీపీ నిర్ణయించింది. పోలీసులు అడ్డుకుంటే అప్పుడు ఏం చేయాలన్న దానిపై టీడీపీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు కుప్పంలో అడుగుపెట్టగానే పోలీసులు అరెస్ట్ చేస్తారా లేక ఎలా అడ్డుకుంటారన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ పెరుగుతోంది.