Andhra pradesh
ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. అధికార, విపక్ష నేతలు సవాళ్లు కూడా చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో బీసీల గురించి తాజాగా జరుగుతున్న చర్చపైనా వైసీపీ, టీడీపీ నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. బీసీ సంక్షేమంపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మంత్రి జోగి రమేష్ ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబుకు సవాల్ విసిరారు.
2022 బాబు-టీడీపికి బూతుల నామ సంవత్సరమని, ప్రజలకు విజయనామ సంవత్సరమని మంత్రి జోగి రమేష్ తెలిపారు. తమ ప్రభుత్వం 2022లో నేరుగా నగదు బదిలీ(డీబీటీ ) ద్వారా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, నిరుపేద కాపు అక్కచెల్లెమ్మలకు, అగ్రవర్ణాల్లోని పేదలకు అత్యధికంగా ప్రయోజనం చేకూర్చిన సంవత్సరమన్నారు. సామాజిక, ఆర్థిక, విద్యా పరంగా, ఆరోగ్య పరంగా 2022.. రాష్ట్రానికి విజయనామ సంవత్సరమన్నారు. 2023లో ఇంకా రెండడగులు ముందుకేసీ డీబీటీ ద్వారా ప్రతి గడపకు దగ్గరయ్యే లా మరింత మేలు చేస్తామన్నారు.

ఇప్పుడు చంద్రబాబు ఒక్క ఛాన్సివ్వాలని అంటున్నాడని, చేత కానోడికి ఎవరైనా ఛాన్సు ఇస్తారా అని జోగి రమేష్ ప్రశ్నించారు. చెడు చేసిన వారికి మళ్ళీ ఛాన్సిస్తారా అని అడిగారు. 14 ఏళ్లు బీసీలపై, ఎస్సీలపై, మైనార్టీలపై… ఎక్కి తొక్కావే, మాతో ఊడిగం చేయించుకున్నావే, మాతో ఓట్లు వేయించుకున్నావే, నీకు ఛాన్సివ్వాలా? దేనికివ్వాలి?, మిమ్మల్ని గెలిపించి, మేం మళ్లీ ఇస్త్రీ పెట్టె పట్టుకోవడానికా? మగ్గం నేయడానికా? గొర్రెలు కాయడానికా? కుండలు చేయడానికా…? కల్లు గీయడానికా, మీరు వచ్చి మళ్ళీ మాకు మోకులు,
ఇస్త్రీ పెట్టెలు ఇస్తారని ఛాన్సివ్వాలా?ఎందుకు ఛాన్సివ్వాలి మీకు అని జోగి ప్రశ్నించారు.
చంద్రబాబు చేసిన సవాల్‌ను స్వీకరించడానికి వైఎస్సార్ పార్టీ తరఫున తాను సిద్ధంగా ఉన్నానని జోగి రమేష్ తెలిపారు. బాబుకు దమ్ముంటే బీసీలపై చర్చకు రావాలన్నారు. ఆ ధైర్యం బాబుకు లేదన్నారు. ఆయన చంచాలు అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, ఎవరొచ్చినా పాత్రికేయులు, లేదా ప్రజల సమక్షంలో చర్చకు సిద్ధమేనని మంత్రి జోగి తెలిపారు. టైమ్, డేట్, ప్లేస్…చెప్పమనండి . మేం చర్చకు సిద్ధమన్నారు.