ఫేం – ప్రతిష్ఠ కోసం ఇదంతా
చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం ఈ రకంగా చేస్తున్నారంటూ ఆర్జీవి మండిపడ్డారు. గుంటూరు సభలో బిస్కెట్లు ఎర వేసి జనాన్ని రప్పించి.. ఫొటోలకు ఫోజులిచ్చి చంద్రబాబు వెళ్లిపోయారన్నారు. మూడు సార్లు సీఎంగా చేసిన చంద్రబాబుకు జనం రద్దీ ఉంటే ఏం చేయాలి.. ఏం జరుగుతుందనేది తెలియదా అని ప్రశ్నించారు. ప్రజలేంటో మీకు తెలియదా.. ఏం జరిగే పరిస్థితులు ఉన్నాయో తెలియదా అంటూ నిలదీసారు. వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం ఇదంతా చేసారని ఆరోపించారు. సభలను జనాలను రప్పించటానికి ఏవేవో ఇవ్వటం.. క్వార్టర్ బాటిల్స్ ఇవ్వటం చంద్రబాబు ప్రారంభించారనేది దేశం మొత్తం తెలిసిన విషయమని ఆర్జీవీ చెప్పుకొచ్చారు. సభలకు వస్తే కానుకలు ఇస్తామనే విధానం ప్రవేశ పెట్టింది కూడా చంద్రబాబే అన్నారు.

మరణాల సంఖ్యతో పాపులారిటీ
జనాల మరణాలను తన పాపులారిటీకి కొలమానంగా చంద్రబాబు భావిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎంత మంది పోతే అంత పాపులారిటీ తనకు ఉన్నట్లుగా చంద్రబాబు ఫీలవుతారని ఆర్జీవి వ్యాఖ్యానించారు. ఆ విధంగా గుంటూరు కంటే కందుకూరులోనే చంద్రబాబుకు ఎక్కువ ప్రజాదరణ ఉన్నట్లుగా చూడాలని వ్యగ్యంగా వ్యాఖ్యానించారు. ఇరుకు సందుల్లో సభలు పెట్టి, ఏవో ఇస్తామని జనాన్ని రప్పిస్తే ఏం జరుగుతుందో 40 ఏళ్ల చరిత్ర ఉన్న మీకు తెలియదా అంటూ ఆర్జీవి ప్రశ్నించారు. మీ మద్దతు దారులు అయితే నమ్ముతారని, తాను నమ్మనంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుకు పాపులారిటీ, ఫేం ముఖ్యమని..ప్రజల ప్రాణాలతో సంబంధం లేదంటూ మండిపడ్డారు.

చంద్రబాబును “నువ్వు” అనే పిలుస్తా..
ఇదే సమయంలో చంద్రబాబును ఇక నుంచి తాను మీరు అనకుండా “నువ్వు” అనే పిలుస్తానని ఆర్జీవి స్పష్టం చేసారు. రాజకీయ నేతకు ముందుగా ప్రజల భద్రత ముఖ్యమని చెప్పారు. కానీ, ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి.. తన వ్యక్తిగత పాపులారిటీ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేసారని ఆర్జీవి చెప్పుకొచ్చారు. మరణించిన వారి మీద నిలబడి పాపులారిటీ పెంచుకొనే ప్రయత్నంగా ఆర్జీవి పేర్కొన్నారు. చంద్రబాబు పైన ఆర్జీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దీంతో, ఇప్పుడు ఈ వ్యాఖ్యల పైన టీడీపీ శ్రేణులు ఏ రకంగా రియాక్ట్ అవుతారో చూడాలి.