
వైఎస్ జగన్ సక్సెస్ మంత్ర
ఏపీలో వైఎస్ జగన్ సక్సెస్ మంత్రాల్లో ఒకటి యూత్. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో యువతను ఆకట్టుకునేందుకు జగన్ పలు కార్యక్రమాలు చేపట్టేవారు. ఇందులో ఒకటి యువభేరి కార్యక్రమం. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఈ కార్యక్రమం నిర్వహించిన జగన్.. రాష్ట్రానికి విభజన హామీలు అమలైతే వచ్చే ప్రయోజనాన్ని యువత మెదళ్లలోకి బలంగా ఎక్కించారు. దీంతో జగన్ వస్తే ఈ హామీలు అమలు చేయిస్తారని యూత్ నమ్మారు. దీని ప్రయోజనం 2019 ఎన్నికల్లో బలంగా కనిపించింది. ఆ విషయాన్ని పట్టుకోవడంలో అప్పుడు విఫలమైన విపక్షాలు ఇప్పుడు అదే బాట పడుతున్నాయి.

పవన్-లోకేష్ యువ మంత్ర
ఇప్పుడు విపక్షంలో ఉన్న యువనేతలు పవన్ కల్యాణ్, నారా లోకేష్ ఇద్దరూ ఇప్పుడు యువ మంత్రాన్నే జపిస్తున్నారు. ఇద్దరూ మాట్లాడుకుని ఈ వ్యూహం అమలు చేస్తున్నారా లేక విడివిడిగా తమ ఆలోచనల ప్రకారమే దీన్ని అమలు చేస్తున్నారో తెలియదు కానీ అచ్చంగా యువ మంత్రం జపిస్తున్నారు. ఈనెలలో తాను చేపట్టబోయే పాదయాత్రకు యువగళం పేరుపెట్టిన లోకేష్.. యువతను టార్గెట్ చేస్తూ ముందుకెళ్లబోతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఈ నెలలోనే శ్రీకాకుళంలో యువశక్తి పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. దాని లక్ష్యం కూడా యువతను మేల్కొలపడమే. దీంతో వీరిద్దరూ జపిస్తున్న యువ మంత్రంపై చర్చ జరుగుతోంది.

జగన్ ఫార్ములా వీరికి పనికొస్తుందా ?
అయితే 2019 ఎన్నికల్లో జగన్ అనుసరించిన యువ మంత్రం ఇప్పుడు లోకేష్- పవన్ లకు పనికొస్తుందా లేదా అన్న దానిపైనా చర్చ జరుగుతోంది. ఎందుకంటే విభజన హామీలపై గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో జనానికి ఉన్న నమ్మకాలు వేరు. ఇప్పుడు పరిస్దితి వేరు. ఇప్పుడు ఎక్కడ చూసినా కేంద్రం విభజన హామీలు అమలు చేస్తుందంటే ఎవరూ నమ్మడం లేదు. అందుకే నేరుగా తమకు అధికారమిస్తే ప్రత్యేక హోదా ఇస్తానన్న కాంగ్రెస్ నే పట్టించుకోని పరిస్ధితి. అదే సమయంలో యువతలో విభజన హామీలతో పాటు వారి సమస్యలపై అవగాహన కల్పించడం ద్వారా వాటిని తామే పరిష్కరించగలమన్న నమ్మకం కల్పించేందుకు పవన్-లోకేష్ శ్రమించబోతున్నారు. కానీ వీరి ప్రయత్నాలు లోతుగా జరిగితే తప్ప యువత వీరిని కూడా నమ్మే పరిస్దితులు కనిపించడం లేదు.