చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల పరామర్శలపై రోజా సెటైర్లు
తాజాగా వీరిద్దరి భేటీపై వైసీపీ మంత్రి రోజా తనదైన శైలిలో సెటైర్ వేశారు. పవన్ కళ్యాణ్ స్వయంగా చంద్రబాబు ఇంటికి వెళ్లి భేటీ కావడాన్ని టార్గెట్ చేసిన మంత్రి రోజా ట్విట్టర్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ చేస్తున్న ఆసక్తికర పరామర్శలపై ఆమె సెటైర్లు వేశారు. జనసేన కార్యకర్తలు విశాఖలో మంత్రుల మీద దాడి చేస్తే చంద్రబాబు వెళ్లి పవన్ ను పరామర్శిస్తారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.
ప్రాణాల కంటే ప్యాకేజ్ గొప్పదా.. జగన్ వీడియో తో టార్గెట్ చేసిన రోజా
ఇక చంద్రబాబు సభలో 11 మంది చనిపోతే పవన్ వెళ్లి చంద్రబాబును పరామర్శిస్తానని రోజా తనదైన శైలిలో సెటైర్లు వేశారు. అంతేకాదు వీళ్ళ దృష్టిలో ప్రాణాల కంటే ప్యాకేజీనే గొప్పదా అంటూ రోజా టార్గెట్ చేశారు. ఇదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సింహం లాగా ఒంటరిగా బరిలోకి దిగడానికి ఎప్పుడు వెనుకాడబోరని జగన్మోహన్ రెడ్డి కి సంబంధించిన ఒక వీడియోను కూడా మంత్రి రోజా పోస్ట్ చేశారు . జగన్మోహన్ రెడ్డి భయపడేది లేదని రోజా ఆ వీడియో ద్వారా స్పష్టం చేశారు.

సింహం సింగిల్ గానే .. జగన్ పై మంత్రి ఆదిమూలపు సురేష్
మరోవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల తాజా భేటీపై మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్ళింది జీ హుజూర్ అనడానికి అంటూ మంత్రి ఆదిమూలపు సురేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక ఎంత మంది పొత్తులు పెట్టుకున్న జగన్ సింహం సింగిల్ గానే పోటీ చేస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ తేల్చిచెప్పారు. ఇక ఇద్దరి మధ్య ఎన్ని సీట్లలో పోటీ చేయాలి ఎన్ని సీట్లు పంచుకోవాలి అన్నది చర్చ జరిగిందని ఆయన పేర్కొన్నారు. నువ్వు ఎన్ని సీట్లలో పోటీ చేయమంటే అన్ని సీట్లు పోటీ చేస్తాను.. ఏది చెయ్యమంటే అది నేను చేస్తాను అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి వెళ్లారని ఆదిమూలపు సురేష్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ దమ్ముంటే ఆ పని చెయ్ : మార్గాని భరత్ సవాల్
చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీరి కలయిక దేనిని సూచిస్తుందో ప్రజలందరికీ బాగా తెలుసని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ బీజేపీతో పొత్తు ఉంటుందని చెబుతూనే చంద్రబాబు ను కలుస్తారని, ప్యాకేజీల గురించి మాట్లాడుకున్నా ఏమీ ఇబ్బంది లేదని ఆయన ఎద్దేవా చేశారు. నిర్మొహమాటంగా బయటకు చెప్పొచ్చు అన్నారు. చంద్రబాబు వల్ల ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పరామర్శించడం మానేసి, చంద్రబాబును పరామర్శించడం ఏమిటని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు సభలో 11 మంది చనిపోయారని, అంతకు ముందు టిడిపి హయాంలో రాజమండ్రి పుష్కరాలలో 29 మందిని చంద్రబాబు పొట్టన పెట్టుకున్నారని, ఆ కుటుంబాలని పవన్ కళ్యాణ్ పరామర్శించి కుండా చంద్రబాబును పరామర్శించటం ఏమిటని మార్గాని భరత్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని మార్గాని భరత్ సవాల్ విసిరారు.