జై ఉత్తరాంధ్ర పేరుతో కొత్త పార్టీ..
మూడు రాజధానుల నినాదం వైసీపీ అజెండాగా ఉంది. ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది. ఈ నెలాఖరున ఈ కేసుకు సంబంధించి తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీతో సహా ప్రతిపక్ష పార్టీలు మూడు రాజధానులు వద్దు..అమరావతి ముద్దు అనే నినాదంతో ముందుకు వెళ్తున్నాయి. ఇదే సమయంలో మంత్రి ధర్మాన లాంటి వారు ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ను గుర్తు చేస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజధానుల అమలు నిర్ణయం అధికారికంగా – న్యాయ పరంగా ఎలా ఉన్నా.. విశాఖ నుంచి పాలనకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. ఈ సమయంలోనే మాజీ జనసేన నేత.. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మెట్ట రామారావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం మేధావులు సమావేశమయ్యారు. జై ఉత్తరాంధ్ర పేరుతో కొత్త పార్టీకి నిర్ణయించారు. సామాజిక వర్గాలు.. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర అజెండాగా పార్టీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.

జనసేన ఎంపీగా పోటీ..మేధావులతో చర్చలు
ఇప్పుడు ఉత్తరాంధ్ర వేదికగా పార్టీ ఏర్పాటు చేస్తున్న ఐఆర్ఎస్ అధికారి రామారావు గతంలో జనసేన లో పని చేసారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి శ్రీకాకుళం ఎంపీగా పోటీలో నిలిచారు. ఆ ఎన్నికల్లో రామారావు 319562 ఓట్లు సాధించారు. ఇప్పుడు ఉత్తరాంధ్రకు చెందిన మేధావులు..విద్యా వేత్తలతో కొంత కాలంగా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం.. విశాఖను పరిపాలనా రాజధాని గా ప్రతిపాదించారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించాలని కోరుతూ జేఏసీ ఏర్పాటు అయింది. ఇప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ధి లక్ష్యంగా ఉత్తరాంధ్ర మేలు కోరుకొనే వారందరితో కలిపి ఈ పార్టీ అడుగులు వేస్తుందని చెబుతున్నారు. రాజకీయం కాదు ఉత్తరాంధ్ర అభివృద్ధి మాత్రమే తాము కోరుకుంటున్నామని స్పష్టం చేస్తున్నారు. మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల నినాదంతో రాజకీయంగా వైసీపీ బలం పెంచుకొనే ప్రయత్నం చేస్తోంది. ఈ సమయంలో కొత్త పార్టీ ఏర్పాటుకు నిర్ణయం జరిగింది.

కొత్త పార్టీ ఏర్పాటు.. ఎవరిపై ప్రభావం
ఉత్తరాంధ్ర వేదికగా ఏర్పాటవుతున్న పార్టీ పూర్తిగా మేధావులు కలిసి తీసుకున్న నిర్ణయంగా తెలుస్తోంది. ఇదే సమయంలో…ఎన్నికల్లో పోటీకి నిలవాలంటే ముందుగా సుప్రీం కోర్టులో రానున్న తీర్పు కీలకం కానుంది. కోర్టు తీర్పు మూడు రాజధానులకు అనుకూలంగా ఉంటే.. ఈ పార్టీ అభివృద్ధి మేనిఫెస్టో తో ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. విశాఖ రాజధానిగా ప్రతిపాదించటం ద్వారా ఉత్తరాంధ్రలో పైచేయి సాధించామని వైసీపీ భావిస్తోంది. గత కొద్ది రోజులుగా జనసేనాని పవన్.. టీడీపీ అధినేత చంద్రబాబుకు ఉత్తరాంధ్రలో వచ్చిన స్పందనతో రెండు పార్టీలు ఉత్తరాంధ్ర పైన రాజకీయంగా ఆశలు పెంచుకుంటున్నాయి. 34 సీట్లు ఉత్తరాంధ్రలో తమవేనని టీడీపీ అంటోంది. ఈ సమయంలో కొత్త పార్టీ అడుగులు.. ఎవరి ఓట్ బ్యాంక్ పైన ప్రభావం చూపుతుందనేది ఆసక్తిగా మారుతోంది.