
తెలంగాణా మహోజ్వల తెలంగాణా అయిందా దొరా? వైఎస్ షర్మిల
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడతానని మాట్లాడడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన షర్మిల తెలంగాణలో మూతపెట్టిన షుగర్ ఫ్యాక్టరీలకు దిక్కులేదు గానీ విశాఖ ఉక్కు ను కాపాడతారట అంటూ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో పలు ప్రశ్నలను సంధించిన వైయస్ షర్మిల మహోజ్వల భారత్ కాదు దొర.. ముందు మహోజ్వల తెలంగాణ అయిందా? అంటూ నిలదీశారు. మీది ఉజ్వల పాలన కాదు! అవినీతి పాలన.. అక్రమాల పాలన..దౌర్జన్యాల పాలన.. నిర్బంధాల పాలన.. అరెస్టుల పాలన.. గూండాల పాలన.. అంటూ సీఎం కేసీఆర్ ను తూర్పారబట్టారు.

తెలంగాణా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా?
దళితులకు 3 ఎకరాల భూమి అందిందా? రైతులకు రుణమాఫీ అయ్యిందా? ఇంటికో ఉద్యోగం వచ్చిందా? నిరుద్యోగ భృతి ఇచ్చారా? పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టారా? గొల్లకుర్మలకు గొర్రెలు వచ్చాయా? ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చారా? ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించారా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మీ ఉజ్వల పాలనలో ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం అందలేదని, పంట నష్టపరిహారం అందలేదని, కౌలు రైతుకు దిక్కే లేదని వైయస్ షర్మిల మండిపడ్డారు.

గ్రామానికి ఇద్దరికి కూడా దళిత బంధు ఇవ్వలేదు.. ఏటా 25 లక్షల మందికి దళిత బంధు ఇస్తారా?
యువతకు కొలువులు లేవని, అర్హులకు స్వయం ఉపాధి లేదని, కార్మికులకు భరోసా లేదని, మహిళా రక్షణ లేదని మండిపడిన వైయస్ షర్మిల మీది ఉజ్వల పాలన కాదు అంటూ నిప్పులు చెరిగారు. గ్రామానికి ఇద్దరికి కూడా దళిత బంధు ఇవ్వని మీరు ఏటా 25 లక్షల మందికి దళిత బంధు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఓట్ల కోసమే పథకాలు పెడుతున్నాము అని కరాఖండిగా చెప్పిన మీ నోటితో ఏం చేసినా ఎన్నికల కోసమేనా అనే మాట రావడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని వైయస్ షర్మిల ఆక్షేపించారు.

జనం మీద అప్పులు పెట్టి మీ ఖజానా నింపుకుంటున్నారు
మునుగోడులో వేల కోట్లు కుమ్మరించి ప్రజలను ప్రలోభపెట్టి మంత్రులు, ఎమ్మెల్యేలు దత్తత పేరుతో దగా చేసి, ఓట్లు దండుకున్న మీకు ఎన్నికల గురించి మాట్లాడే అర్హత లేదని వైఎస్ షర్మిల తేల్చి చెప్పారు. మోడీ దేశాన్ని పట్టపగలే దోపిడీ చేస్తుంటే .. మీరు పట్టపగలే తెలంగాణ సొమ్మును దోచుకుంటున్నారు అంటూ వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం మీద అప్పులు పెట్టి మీ ఖజానా నింపుకుంటున్నారు అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణా రాష్ట్రాన్ని నాశనం చేసి, రాష్ట్రాన్ని కోలుకోలేని స్థితికి తీసుకువెళ్లి దేశాన్ని ఏలతాడట దొర అంటూ వైఎస్ షర్మిల నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏం ఉద్దరించారు అని దేశాన్ని ఉద్దరిస్తారు అంటూ వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్ ను తీవ్రస్థాయిలో టార్గెట్ చేశారు.