
ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్ చేసిన మెగాస్టార్..
మెగాస్టార్ చిరంజీవి తన ఫిట్‌నెస్ సీక్రెట్ బయట పెట్టారు. ఫిట్ గా కనిపించాలంటే ఆహారపు అలవాట్లు.. వ్యాయామంతో మాత్రమే సాధ్యం కాదన్నారు. ఖైదీ నంబర్ 150 సినిమా ముందు తన మైండ్ సెట్ వేరు.. ఆ సినిమా తరువాత వేరు అని చెప్పుకొచ్చారు. గతంలో ఎలాంటి చిరంజీవిని చూసామో మాకు అలాంటి చిరంజీవి కావాలని ప్రేక్షకులు ఆ సినిమాను విజయవంతం చేసారని మెగాస్టార్ పేర్కొన్నారు. దీంతో తన అనుమానాలన్నీ తొలిగిపోయాయని వివరించారు. ఇప్పుడు వాల్తేరు వీరయ్య ట్రైలర్స్ చూసిని వాళ్లు తనను ఖైదీ నెంబర్ 150 కంటే యంగ్ గా కనిపిస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తాను దీని కోసం ఎంత వ్యాయామం చేస్తానో, ఎలాంటి కఠినమైన ఆహార నియమాలు పాటిస్తానో తనకు మాత్రమే తెలుసన్నారు. కానీ, ప్రేక్షకుల ఆదరణ చూసిన తరువాత ఆ కష్టమంతా ఆనందంగా మారుతుందన్నారు.

పవన్ ను తిట్టిన వారే బలిమాలతారు..
తమ్ముడు పవన్ గురించి చిరంజీవి ఆసక్తి కర అంశాలు వెల్లడించారు. పవన్ తనకు బిడ్డ లాంటి తమ్ముడని చెప్పారు. పవన్ ను తన చేతులతో ఎత్తుకొని పెంచానని వివరించారు. తాను, తన సతీమణ సురేఖ పవన్ కు తల్లితండ్రులలాంటి వాళ్లమని పేర్కొన్నారు. పవన్ కు తామంటే అంతే ప్రేమ అని వివరించారు. పవన్ కు కించిత్ స్వార్ధ్ం ..డబ్బు యావ..పదవీ కాంక్ష లేదని విశ్లేషించారు. తన కోసం ఎప్పుడూ ఆలోచన చేయరని పేర్కొన్నారు. తన అన్నగా కాకుండా.. పవన్ ను దగ్గరగా చూసిన వ్యాక్తిగా చెబుతున్నానని చిరంజీవి పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం వరకు పవన్ కు సొంత ఇల్లు లేదని చెప్పారు. వేళకు అన్నం తినరని, బట్టలు సరిగ్గా వేసుకోరని బాధ పడ్డారు. సమాజానికి ఏదైనా చేయాలనే తపనతో అన్నీ వదిలేసిన యోగిలాంటి వాడని చిరంజీవి అభివర్ణించారు. పవన్ ను రాజకీయాల్లో కొందరు మితిమీరి మాటలు అంటున్నప్పుడు బాధ కలుగుతుందన్నారు. పవన్ ను తిట్టినవాళ్ల తన వద్దకు వచ్చి పెళ్లిళ్లకు..పేరంటాలకు పిలుస్తారని..రమ్మని బలమాలతారని చెప్పుకొచ్చారు. తన తమ్ముడిని అన్ని మాటలు అన్నవాళ్లతో మాట్లాడాల్సి వస్తుంది..కలవాల్సి వస్తుందనే బాధ ఉంటుందన్నారు.

రాజకీయాలనే మురికి కూపంలోకి వెళ్లాడు
చిత్తశుద్ది..నిజాయితీ ఉన్న పవన్ రాజకీయాలనే మురికికూపంలోకి వెళ్లారని చిరంజీవి పేర్కొన్నారు. అక్కడ ఉన్న మురికిని ప్రక్షాళన చేయలనుకుంటున్నారని చెప్పారు. ఆ సమయంలో కొంత మురికి పవన్ కు అంటుకుంటుందన్నారు. స్వచ్చమైన ప్రయత్నం చేస్తున్నప్పుడు సహకరించాలని..ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. తాను శత్రువులను కూడా మిత్రులుగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటానని చిరంజీవి వివరించారు. వాళ్లు తనను ఏమీ చేయలేరనే విషయం తనకు తెలుసన్నారు. కానీ, ఒక శత్రువు ఉన్నాడనే విషయం తనకు ఇబ్బందిగా ఉంటుందన్నారు. ఆర్దికంగా ఒకటి పక్కన ఎన్ని సున్నాలు చేర్చుకుంటూ వెళ్లాలనేది ముఖ్యం కాదని, మనసు పక్కన ఎన్ని మనసులు చేర్చుకుంటూ వెళ్తానననే తనకు ముఖ్యమని చిరంజీవి స్పష్టం చేసారు. తన మనసులో మాత్రం 80 ఏళ్లు వచ్చినా అందరినీ అలరించేలా కుర్ర వేషాలు వేయాలని ఉందంటూ చిరంజీవి నవ్వుతూ తన మనసులో మాట చెప్పేసారు.