పార్టీ మార్పుపై మాజీ హోం మంత్రి సుచరిత కీలక వ్యాఖ్యలు..!!




సుచరిత పదవుల్లో కోత – సర్దుబాటు

మేకతోటి సుచరిత రాజకీయ అడుగులు ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతున్నాయి. వైసీపీ ఏర్పాటు నుంచి సుచరిత జగన్ కు మద్దతుగా నిలిచారు. ఫలితంగా 2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తన తొలి కేబినెట్ లో సుచరితకు హోం మంత్రిగా అవకాశం ఇచ్చారు. రాష్ట్ర విభజన తరువాత ఏపీ తొలి మహిళా హోం మంత్రిగా సుచిరతకు అవకాశం దక్కింది. కేబినెట్ విస్తరణలో భాగంగా సుచరిత ను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆ సమయంలో సుచరిత మనస్థాపానికి గురయ్యారు. అనుచరులు ఆందోళనకు దిగారు. ఆ తరువాత తాడేపల్లిలో పార్టీ నాయకత్వంతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రికి మద్దతు ప్రకటించారు. వైసీపీలోనే కొనసాగుతున్నట్లు వెల్లడించారు.

నా భర్త పార్టీ మారితే నేను వెళ్లాల్సిందేగా...

నా భర్త పార్టీ మారితే నేను వెళ్లాల్సిందేగా…

సుచరిత రాజకీయంగా తన మనుగడ వైసీపీతోనే అని స్పష్టం చేసారు. తాను ఒక స్టేట్‌మెంట్ ఇచ్చానంటే తన భర్త దయాసాగర్ కూడా దానికి కట్టుబడే ఉంటారని తెలిపారు. ‘అలా కాకుండా నా భర్త దయాసాగర్ పార్టీ మారతాను నువ్వు నాతో రా అంటే ఎంత రాజకీయ నాయకురాలినైనా భర్తతో పాటు వెళ్ళాల్సిందేగా అని వ్యాఖ్యానించారు. తన భర్త ఒక పార్టీలో.. తాను మరొక పార్టీలో తమ పిల్లలు వేరొక పార్టీలో ఉండరని.. ఉంటే అంతా ఒక్క పార్టీలోనే ఉంటామన్నారు. రాజకీయాల్లో మనగలిగినన్నాళ్ళు ఏపీ సీఎం వైఎస్ జగన్‌తో ఉండాలనుకున్నామని సుచరిత స్పష్టం చేసారు. సుచరిత భర్త దయాసాగర్ రాజకీయంగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. ఇప్పుడు సుచరిత వ్యాఖ్యలతో ఆయన వైసీపీలోకి అధికారికంగా ఎంట్రీ ఇవ్వనున్నారా..లేక మరో పార్టీ వైపు చూస్తున్నారా అనే చర్చ మోదలైంది. సుచరిత తాను వైసీపీలో ఉంటానని చెబుతూనే..ఈ వ్యాఖ్యలు చేయటం ఏంటని వైసీపీ వర్గాలు ఆరా తీస్తున్నాయి.

సుచరిత పోటీ చేస్తారా - భర్తకు ఛాన్స్ ఇస్తారా

సుచరిత పోటీ చేస్తారా – భర్తకు ఛాన్స్ ఇస్తారా

ఇప్పుడు సుచరిత భర్త దయాసాగర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. దీంతో, వచ్చే ఎన్నికల్లో సుచరిత పోటీ చేస్తారా లేదా అనేది సందేహంగా కనిపిస్తోంది. దయాసాగర్ లోక్ సభకు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. దయాసాగర్ ఎంపీగా బరిలో ఉంటే, సుచరితకు సీటు ఉండదనే చర్చ పార్టీలో వినిపిస్తోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ నియోజకవర్గాల వారీగా సర్వే నివేదికలు తెప్పించుకుంటున్నారు. గెలుపే ప్రామాణికంగా సీటు ఖరారు చేస్తానని స్పష్టం చేస్తున్నారు. ఆరు నెలల ముందే టికెట్ల ఖరారుకు నిర్ణయించారు. దీంతో, ఇప్పుడు ప్రతీ సీటు.. చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.




Source link

Spread the love

Leave a Comment