
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీకి వేగంగా అడుగులు పడుతున్నాయి. సంక్రాంతి తర్వాత పార్టీలో చేరికలు ఉంటాయని భావించినా అంతకంటే ముందే చేరికలు మొదలు కావడం, అందులో నుంచే ఏపీలో బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను ఎంపిక చేసుకోవడం చకచకా జరిగిపోయాయి. దీంతో బీఆర్ఎస్ పార్టీ త్వరలో రాష్ట్రంలో లాంఛనంగా రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చేసింది. ఏటా సంక్రాంతి సందర్భంగా ఏపీలోని భీమవరానికి వచ్చి పండుగ సంబరాల్లో పాల్గొనే తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఈసారి కూడా రానున్నారు. అయితే ఈసారి మాత్రం కీలక నేతలతో భేటీ అయ్యేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

బీఆర్ఎంట్రీపై వైసీపీ, బీజేపీ ఫైర్
ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీపై నిన్న మొన్నటివరకూ సున్నితంగా స్పందించిన అధికార వైసీపీ.. తాజాగా మాత్రం విమర్శల జోరు పెంచింది. బీఆర్ఎస్ ఏపీలో చేయడానికి ఏమీ లేదని,తాము దాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదని మాజీ మంత్రి కొడాలి, సజ్జల వంటి వారు చెప్తుంటే, కేసీఆర్ కు ఏపీ ప్రజలు బుద్ది చెప్తారని మంత్రి రోజా హెచ్చరించారు. అలాగే బీజేపీ ఎంపీ జీవీఎల్ కూడా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరీ ఏపీకి అన్యాయం చేసిన కేసీఆర్.. ఇప్పుడు ఇక్కడకు ఎలా వస్తారని ప్రశ్నించారు. పోలవరంపై సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్లను గుర్తుచేశారు. మిగతా బీజేపీ నేతలు కూడా కేసీఆర్ పై, బీఆర్ఎస్ పై విమర్శలు మొదలుపెట్టేశారు.

బీఆర్ఎస్ ఎంట్రీపై టీడీపీ, జనసేన మౌనం
అదే సమయంలో బీఆర్ఎస్ ఎంట్రీపై విపక్ష టీడీపీ,జనసేన మౌనం పాటిస్తున్నాయి. బీఆర్ఎస్ రాకతో తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. అయితే జనసేన మాజీ నేతలైన తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబు వంటి వారిని బీఆర్ఎస్ తమ పార్టీలో చేర్చుకున్న నేపథ్యంలో పవన్ స్పందిస్తారని భావించినా అలా జరగలేదు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కూడా బీఆర్ఎస్ ఎంట్రీపై స్పందించేందుకు నిరాకరిస్తున్న పరిస్దితి. దీంతో ఇరు పార్టీలు అనవసరంగా కేసీఆర్ తో కెలుక్కునేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.

అసలు కారణమిదే ?
అయితే ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీపై వైసీపీ, బీజేపీ ప్రతికూలంగా స్పందిస్తుండటం, టీడీపీ-జనసేన మౌనం పాటిస్తుండటం వెనుక ఆసక్తికర కారణం కనిపిస్తోంది. బీఆర్ఎస్ అసలు టార్గెట్ బీజేపీ. కాబట్టి బీజేపీ నేతలు బీఆర్ఎస్ ఏపీ ఎంట్రీపై విమర్శలు గుప్పించడం సహజమే. అలాగే బీజేపీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న వైసీపీ కూడా భవిష్యత్తులో ఇదే అంశంపై బీఆర్ఎస్ విమర్శలు చేయడానికి ముందే తామే ఓ అడుగు ముందుకేసి కేసీఆర్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది.
అయితే టీడీపీ, జనసేనకు మాత్రం ప్రస్తుతానికి ఆ అవసరం కనిపించడం లేదు. కేసీఆర్ ను వీరిద్దరూ విమర్శించినా, విమర్శించకపోయినా తమకు వచ్చే లాభమూ లేదూ నష్టమూ లేదనే భావనలో ఇరు పార్టీలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో జగన్, బీజేపీతో బీఆర్ఎస్ వైరం కొనసాగిస్తే.. అది అంతిమంగా తమకు లాభం చేస్తుందనే భావనలో టీడీపీ-జనసేన ఉన్నట్లు తెలుస్తోంది.