
శోభాయమానంగా శ్రీవారి ఆలయం
ముక్కోటి ఏకాదశి కావటంతో శ్రీవారి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ రోజు ముక్కోటి ఏకాదశి కావటంతో శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు ముందుగానే టికెట్లు పొందారు. ఆన్ లైన్ లో రూ 300, ఆఫ్ లైన్ సర్వదర్శనం టికెట్లు జారీ చేసారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల కొండను విద్యుత్, పుష్పాలంకరణలతో ముస్తాబు చేశారు. తిరుపతి విమానాశ్రయానికి ప్రముఖుల విమానాలు వరుసగా చేరుతున్నాయి. స్వామివారిని దర్శించా లన్న తపనతో దూరప్రాంతాలకు చెందిన దీక్షాదారుల ఆదివారం రాత్రికే ఆలయానికి చేరుకున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన స్వాము లంతా దర్శనానంతరం ఇరుముడులు సమర్పించనున్నారు. ఉదయం స్వామివారి గిరి ప్రదక్షిణం వైభవంగా సాగింది. వేలాదిమంది భక్తులు, గోవింద దీక్షాదారుల గిరిప్రదక్షిణతో శేషాచల పరిసరాలు శోభిల్లాయి. శ్రీనివాసా గోవిందా… శ్రీవేంకటేశా గోవిందా… ఆపద్భాంధవ గోవిందా అంటూ వారంతా భక్తి పారవశ్యంతో ముందుకు సాగుతున్నారు.

జనవరి 11 వరకు వైకుంఠ ద్వార దర్శనం
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాల్లో భక్తులు బారులు తీరారు.గతఏడాది తరహాలోనే ఈసారి కూడా పది రోజులపాటు వైకుంఠద్వార దర్శనాలు జరగనున్నాయి. జనవరి 11వరకు వైకుంఠద్వారాలను తెరిచి ఉంచుతారు. ఈ పది రోజుల పాటు దాదాపు 8.50 లక్షల మందికి శ్రీవారి దర్శనం కల్పించేలా నిర్ణయించారు. సిఫార్సు లేఖలను నిలిపివేశారు. వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకు టైంస్లాట్ సర్వదర్శన టోకెన్ల జారీ ప్రారంభమైంది. సాయంత్రానికి లక్షన్నర టోకెన్ల జారీ పూర్తయ్యిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని సదుపాయాలు కల్పించామని చెప్పారు. కేటాయించిన తేదీ, సమయానికే భక్తులు రావాలని కోరారు. కాగా, కరోనా వేళ అందరూ మాస్కు తప్పనిసరిగా వినియోగించాలని కోరారు. తిరుమలలోని నాలుగు ప్రాంతాల్లో మినీ అన్నదాన కేంద్రాలను ప్రారంభించాలని బోర్డు నిర్ణయించిందని చెప్పారు. ఇందులో భాగంగానే పాత అన్నదాన భవనంలో తిరిగి అన్నప్రసాద వితరణ ప్రారంభించామన్నారు. ఇక్కడ రోజుకు 15 వేల మందికి అన్నదానం జరుగుతుందన్నారు.

కొనసాగుతున్న టోకెన్ల జారీ..
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం సర్వ దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. తిరుపతిలో ఎంపిక చేసిన తొమ్మది కేంద్రాల్లో వీటిని అందిస్తున్నారు. శనివారం రాత్రి నుంచే ఈ కేంద్రాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజాము నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. తెల్లవారే సరికి దాదాపు 45 వేల టోకెన్ల జారీ పూర్తయింది.
ఈ తరువాత మరో నాలుగు గంటల్లో 3వ తేదీకి సంబంధించిన టోకెన్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 6వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్ల జారీ కొనసాగుతోంది. టోకెన్ల జారీ కొనసాగుతుందని..11వ తేదీ వరకు పూర్తయ్యే దాకా సర్వదర్శనం టోకెన్లు అందిస్తామని టీటీడీ ప్రకటించింది.