వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి: బెంగాల్‌లో ఇటీవలే ప్రారంభం
కోల్‌కతా: ఇటీవలే పశ్చిమబెంగాల్‌లోని హౌరా నుంచి న్యూజల్పాయిగురి మధ్య ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుపై రాళ్ల దాడి జరిగింది. మాల్దా జిల్లాలోని కొందరు దుండగులు ఈ రైలుపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఎవరికీ కాలేదు. కానీ, రైలు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ మేరకు వివరాలను అధికారులు వెల్లడించారు.

మాల్దా పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో కుమార్ గంజ్ రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ దాడిలో 22303 నెంబర్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలులో సీ13 కోచ్ అద్దాలు ధ్వంసమైనట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం 5.10 గంటల సమయంలో ఈ ఘటన జరిగినప్పటికీ రైలు మధ్యలో ఆగలేదని చెప్పారు.

ఆ తర్వాత ఆగాల్సిన మాల్దా టౌన్ రైల్వే స్టేషన్లోనే రైలు ఆగిందని వెల్లడించారు. ఈ ఘటనపై ఆర్పీఎఫ్ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో రాష్ట్రంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటనపై ఎన్‌ఐఏ దర్యాప్తు జరపాలని బీజేపీ డిమాండ్ చేయగా.. తృణమూల్ కాంగ్రెస్ “రాష్ట్ర పరువు తీయడానికి కుట్ర” పన్నుతున్నట్లు ఆరోపించారు.

ఏ రాష్ట్రంలోనూ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై దాడులు జరగడం లేదా ధ్వంసం చేయడం సిగ్గుచేటని, రాష్ట్ర ప్రభుత్వం తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు నేరస్థులకు వ్యతిరేకంగా ఏమీ చేయదని పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ అన్నారు.

ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరైన హౌరా స్టేషన్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమంలో ‘జై శ్రీరామ్’ నినాదాలు చేసినందుకు ఈ సంఘటన “ప్రతీకారం” కాదా? అని పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నాయకుడు సువేందు అధికారి ప్రశ్నించారు. రాళ్ల దాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తునకు సువేందు అధికారి డిమాండ్ చేశారు.

డిసెంబర్ 30న పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్‌గా ప్రారంభించిన విషయం తెలిసిందే.

Story first published: Wednesday, January 4, 2023, 0:08

Source link

Spread the love

Leave a Comment