
రోడ్ షోలపై ఏపీ సర్కార్ బ్యాన్
ఏపీలో తాజాగా కందుకూరు, గుంటూరులో చంద్రబాబు నిర్వహించిన సభల్లో తొక్కిసలాట జరిగి పది మందికి పైగా చనిపోయిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో బహిరంగ సభలు, రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించకుండా హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాజా ఘటనల నేపథ్యంలో చంద్రబాబు సభలకు అనుమతివ్వొద్దంటూ, ఆయనపై కేసులు పెట్టాలంటూ వైసీపీ నేతలు డిమాండ్లు చేస్తున్న తరుణంలో వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి.

లోకేష్ యాత్ర కోసమేనన్న టీడీపీ
ఏపీ ప్రభుత్వం రోడ్ షోలు, బహిరంగసభలపై నిషేధం విధించడం వెనుక లోకేష్ త్వరలో చేపట్టబోయే పాదయాత్ర ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సభలు, రోడ్డుషోలపై ఆంక్షలు విధించడం చూస్తే చంద్రబాబు అంటే జగన్ భయపడుతున్నారని టీడీపీ నేతలు విమర్శించారు. ప్రభుత్వ కుట్ర ఫలితమే కందుకూరు, గుంటూరు సంఘటనలన్నారు. చంద్రబాబు సభలకు జనాలు పోటేత్తుతుంటే, జగన్ సభలకు కాళీ కుర్చీలు కనిపించడంతో రాష్ట్రంలో జగన్ పని అయిపోయింది అనే మాట తరచూ వినిపిస్తూ ఉండడంతోనే ఇటువంటి ఆంక్షలు పెడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. జీవోలు, 30 యాక్ట్ లు ప్రతిపక్షానికే వర్తిస్తాయి, అధికార పక్షానికి వర్తించవన్నారు. రోడ్ షో చేయకూడదని ఆంక్షలు విధించిన జగన్ నేడు రాజమండ్రిలో మున్సిపల్ స్టేడియం నుండి ఆర్ట్స్ కాలేజీ వరకు ఎట్లా రోడ్ షో నిర్వహిస్తాడని ఆయన ప్రశ్నించారు.

అమిత్ షా కోసమేనన్న బీజేపీ
త్వరలో ఏపీలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించబోతున్నారు. ఇందులో రోడ్ షోలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం అమిత్ షా రోడ్ షోను అడ్డుకునేందుకేనని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించారు. వాస్తవాలకు బిన్నంగా, రాజకీయం కోణంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఎవరూ రోడ్లపైకి రాకూడదు అని నిషేధించడం విచిత్రంగా ఉందని బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. సభలు సమావేశాలు నిర్వహించడం రాజకీయ పార్టీలు హక్కని వైసీపీ గుర్తిస్తే మంచిదన్నారు. తప్పు చేసిన వ్యక్తులు , పార్టీ పై చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అయితే మరో బీజేపీ ఎంపీ జీవీఎల్ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు.

సమర్ధించుకున్న వైసీపీ
మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని వైసీపీ నేతలు సమర్ధించుకుంటున్నారు. లోకేష్ పాదయాత్రను దృష్టిలో ఉంచుకుని వైసీపీ ప్రభుత్వం ఈ నిర్ణయంతీసుకుందన్న టీడీపీ విమర్శల్ని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తప్పుబట్టారు. ప్రభుత్వం తాజా ఘటనల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుందని, ఇందులో విపక్షాలతో పాటు వైసీపీ నేతల సభలు, సమావేశాలు కూడా వస్తాయని అంజాద్ బాషా తెలిపారు. నిబంధనలు అందరికీ ఒకేలా వర్తిస్తాయన్నారు. ఇతర వైసీపీ నేతలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారు.