సరస్వతీ దేవిపై రేంజర్ల రాజేష్ అనుచిత వ్యాఖ్యలు
మొన్న అయ్యప్ప స్వామిపై నాస్తికవాది బైరి నరేష్ చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా కొనసాగుతుండగానే , సరస్వతి దేవి పై రేంజర్ల రాజేష్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇక సరస్వతి అమ్మవారిని అవమానిస్తూ నాస్తికవాది రేంజర్ల రాజేష్ చేసిన వ్యాఖ్యలపై బాసర ఆలయం వద్ద స్థానికులు, గ్రామస్తులు నిరసన చేపట్టారు. బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలో విధులు నిర్వహించే అర్చక సంఘం సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన ద్వారం వద్ద అర్చకులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

రేంజర్ల రాజేష్ అరెస్ట్ కు డిమాండ్ .. బాసర బంద్
ఇక బాసర శివాజీ చౌక్ వద్ద స్థానికులు ధర్నా నిర్వహించారు. రేంజర్ల రాజేష్ పై చర్యలు తీసుకోవాలని, అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తూ షాపులు బంద్ చేయించి రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లలో రేంజర్ల రాజేష్ పై ఫిర్యాదు చేశారు. రేంజర్ల రాజేష్ పై చర్యకు డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. అంతేకాకుండా స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

అయ్యప్ప పుట్టుకపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ అరెస్ట్
కాగా అయ్యప్ప స్వామి పుట్టుక పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, హిందువుల మనోభావాలను దెబ్బతీసిన బైరి నరేష్ ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వరంగల్లో టాస్క్ ఫోర్స్ పోలీసులు బైరి నరేష్ ను పట్టుకున్నారు. బైరి నరేష్ అయ్యప్ప స్వామిపై చేసిన వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో హిందువులు, హిందూ సంఘాలు, అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

రేంజర్ల రాజేష్ అరెస్ట్ కు డిమాండ్
బైరి నరేష్ ను అరెస్ట్ చేయాలని, అతనిని కఠినంగా శిక్షించాలని పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అతనిపై కేసు నమోదు చేసిన కొడంగల్ పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి అతని కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు పోలీసులు వరంగల్లో బైరి నరేష్ ను పట్టుకున్నారు. అతనిపై వివిధ సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి అతడిని కోర్టులో హారుపరిచారు. కోర్టు అతనికి రిమాండ్ విధించింది. ఇక ఇదే క్రమంలో సరస్వతీ అమ్మవారిని అవమానించిన రేంజర్ల రాజేష్ ను కూడా అరెస్ట్ చెయ్యాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు.