
2023లో కీలకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికలు:
ఫిబ్రవరి-మార్చి 2023లో, మూడు ఈశాన్య రాష్ట్రాలు – మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌లలో ఓటింగ్ జరగనుంది. నవంబర్ నాటికి మిజోరంలో కూడా ఎన్నికలు జరగనున్నాయి. స్థానిక మిత్రపక్షమైనఐపీఎఫ్‌టీతో కలిసి త్రిపురలో బీజేపీ అధికారంలో ఉంది. నాగాలాండ్, మేఘాలయలో ప్రాంతీయ మిత్రపక్షాల జూనియర్ భాగస్వామిగా ఉంది. మిజోరంలో కాంగ్రెస్, అధికార మిజో నేషనల్ ఫ్రంట్ మధ్య పోటీ నెలకొంది. 2018లో తొలిసారిగా బీజేపీ గెలిచినా.. ఇప్పుడు దాని శ్రేణుల్లో భారీ తిరుగుబాటును ఎదుర్కొంటున్న త్రిపురపై ప్రత్యేక దృష్టి సారించింది.

బీజేపీకి కీలకంగా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు 2023:
దక్షిణ భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే ప్రస్తుతం బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలోనూ 2023లో ఎన్నికలు జరగనున్నాయి. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య ఇక్కడ ప్రధాన పోటీ నెలకొంది. మరోపార్టీ జనతా దళ్(సెక్యూలర్) కూడా కీలకంగానే మారనుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీతో కలిసి జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. కీలక పరిణామాలతో 2019లో బీజేపీలో అధికారంలోకి వచ్చింది. మరోసారి కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తున్న బీజేపీకి.. పార్టీ నేతల మధ్య విభేదాలే సవాలుగా మారనున్నాయి.

తెలంగాణలోనూ 2023లోనే ఎన్నికలు: బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ!
తెలంగాణ రాష్ట్రంలోనూ 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత్ రాష్ట్ర సమితికి ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ కసరత్తులు చేస్తుండగా.. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకబడినప్పటికీ.. రాష్ట్రంలో త్రిముఖ పోటీ నెలకొందనే చెప్పాలి. 2024 లోక్‌సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈ రాష్ట్ర ఎన్నికలు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు, మరోవైపు బీజేపీకి కూడా కీలకమనే చెప్పాలి. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్దమైన కేసీఆర్‌కు లిట్మస్ టెస్టులాంటిదే.

మధ్యప్రదేశ్‌లోనూ 2023లోనే ఎన్నికలు: బీజేపీ, కాంగ్రెస్‌కు కీలకం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 2023 నవంబర్-డిసెంబర్ మధ్య కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి ఈ రాష్ట్రం ఎంతో కీలకం కానుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ.. జ్యోతిరాదిత్య సింధియా సహా 20 మందికిపైగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి.. బీజేపీలో చేరడంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగే ఈ రెండో అతిపెద్ద రాష్ట్రంలోని అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి గానీ, కాంగ్రెస్ పార్టీకి గానీ కీలకమనే చెప్పాలి.

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లోనూ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్
ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ రాష్ట్రాల్లో బీజేపీ ప్రతిపక్షంగా కొనసాగుతోంది. 2024 లోక్‌సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈ రాష్ట్రాలు కూడా అటు కాంగ్రెస్ పార్టీకి, ఇటు బీజేపీకి కూడా కీలకంగా మారనున్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తుండగా.. బీజేపీ కూడా అదే స్థాయిలో ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనే అవకాశం ఉంది.