కాపు ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్
కాపు ఓటింగ్ ఎవరికి అనుకూలంగా ఉంటుందనే అంశం పైన మాజీ ఎంపీ ఉండవల్లి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తి కర వ్యాఖ్యలు చేసారు. ఏపీలో సీఎం జగన్ చెబుతున్నట్లు క్లాస్ వార్ కాదని..క్యాస్ట్ వార్ కొనసాగుతోందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వస్తే ప్రస్తుతం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇస్తున్న అంశం పైన స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఆలస్యం అయినా సంక్షేమ పథకాల్లో భాగంగా పెన్షన్లు మాత్రం ఆగటం లేదన్నారు. జీతాలు ఆలస్యం అయితేనే ఉద్యోగులే గొడవ చేస్తున్నారని.. పెన్షన్లు ఆలస్యం అయితే సహించే పరిస్థితి ఉండదన్నారు. కాపులు సంఖ్య పరంగా అధికారం డిసైడ్ చేసే స్థానంలో ఉన్నా.. ఆర్దికంగా ..రాజకీయంగా ప్రయోజనాలు పొందని లార్జెస్ట్ కమ్యూనిటీగా మిగిలిపోయిందని విశ్లేషించారు.

పవన్ ను కాదని జగన్ కు వేశారు
టీడీపీ – జనసేన పొత్తు పెట్టుకున్న కాపులంతా ఆ పార్టీలకే ఓటు వేస్తారని చెప్పలేమని ఉండవల్లి పేర్కొన్నారు. కాపులకు పట్టుదల ఎక్కువగా ఉంటుందని.. 2014 ఎన్నికల్లో టీడీపీకి వేసిన కాపు మెజార్టీ ఓటర్లు 2019లో పవన్ కు మద్దతు ఇవ్వలేదన్నారు. 2019 ఎన్నికల్లో కాపులు మెజార్టీ ఓటింగ్ జగన్ కు అనుకూలంగా పోల్ అయిందని విశ్లేషించారు. కాపు ఓటింగ్ ఎవరికి పడితే వారికి అధికారం దక్కించుకోవటానికి అవకాశం ఉంటుందన్నారు. ఏ రంగంలో చూసినా కమ్మ – రెడ్డి వర్గాలు పోటీ పడుతున్నాయని.. కాపులు వెనుకబడి ఉన్నారని చెప్పుకొచ్చారు. కాపులు ఎవరికి వేసినా మెజార్టీ ఓటింగ్ అటే ఉంటుందని వివరించారు. గోదావరి జిల్లాల్లో కాపు ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా పేర్కొన్నారు. పవన్ అప్పుడు వేయలేదని..ఇప్పుడు వేస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉందన్నారు.

చిరంజీవి- పవన్ కు తేడా అక్కడే..
చిరంజీవి – పవన్ కల్యాణ్ కు తేడా గురించి ఉండవల్లి విశ్లేషించారు. 2009లో చిరంజీవి ఓడిపోయిన తరువాత క్రమేణా రాజకీయాలకు దూరం అయ్యారని గుర్తు చేసారు. 2019లో పవన్ రెండు అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయినా..వెంటనే తిరిగి ప్రజల్లోకి వచ్చారని గుర్తు చేసారు. చిరంజీవి 2014 వరకు పార్టీ కొనసాగించి ఉంటే రాష్ట్ర విభజన సమయంలో సీఎం అయ్యే అవకాశం దక్కేదన్నారు. పవన్ కు సినిమాలతో పాటుగా రాజకీయాలన్నా ఆసక్తి ఎక్కువగా ఉందన్నారు. చిరంజీవికి సినిమాలే ప్రాణమని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో హోరా హోరీ పోరు తప్పదని ఉండవల్లి అంచనా వేసారు. ఇప్పటికే వైసీపీ – టీడీపీ రెండు పార్టీలు అధికారం పైన ధీమాతో ఉన్నాయి.