
మాట మార్చిన కంపెనీ..
అమెజాన్ కంపెనీలో కొత్త ఏడాది ఉద్యోగుల తొలగింపులు ఉంటాయని అందరూ భావించిందే. కానీ.. ఇప్పుడు అవి గతంలోని అంచనాలను పూర్తిగా మార్చేశాయి. కంపెనీ భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్లు వార్తలు వైరల్ కావటంతో యాజమాన్యం సైతం దీనిపై ఓపెన్ అయ్యింది. ఈ వార్తలు వాస్తమేనన్న ఈ-కామర్స్ దిగ్గజం సీఈవో ఆండీ జాస్సీ అదే విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. తొలగింపులపై నవంబర్‌లో మాట్లాడుతూ.. అనిశ్చిత, కష్టతరమైన ఆర్థిక వ్యవస్థను కంపెనీ కొనసాగిస్తుందని తెలిపారు. 2023లో ఉద్యోగాల తొలగింపులు జరుగుతాయని జాస్సీ హెచ్చరించారు.

ఎంత మందిని తొలగిస్తారు..
ఆండీ జాస్సీ ప్రకటన ప్రకారం కంపెనీ ఈ ఏడాది మెుత్తంగా 18,000 మందిని తొలగించవచ్చని తెలుస్తోంది. అయితే మారుతున్న పరిస్థితులను బట్టి ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉందని నిపుణులు భావిస్తున్నారు. కంపెనీ గతంలో అనుకున్నదాని కంటే 70 శాతం ఎక్కువ ఉద్యోగాల్లో కోతకు అమెజాన్ సిద్ధమైంది. అయితే ఎక్కువ తొలగింపులు అమెజాన్ స్టోర్‌లు, PXT సంస్థల్లో ఉంటాయని కంపెనీ తన నోట్ లో వెల్లడించింది.

వార్షిక ప్రణాళిక..
2023లో కంపెనీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలోని అన్ని టీమ్స్ పనిచేస్తున్నాయని సీఈవో ఆండీ జాస్సీ వెల్లడించారు. అనిశ్చిత ఆర్థిక వ్యవస్థ కారణంగా ఈ సంవత్సరం సమీక్ష చాలా కష్టంగా ఉందని అన్నారు. కొన్నేళ్లుగా తాము ఉద్యోగులను వేగంగా తొలగించాల్సి వస్తోందని వెల్లడించారు. కొత్త సంవత్సరం ప్రారంభంలో మరిన్ని తొలగింపులు ఉండవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు. తొలగించబడే ఉద్యోగులకు కంపెనీ మంచి కాంపెన్సేషన్, బీమా ప్రయోజనాలను అందిస్తుందని అన్నారు. ప్రభావితమైన ఉద్యోగులతో కంపెనీ జనవరి 18 నుంచి మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

ఇతర తొలగింపులు..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న లేఆఫ్ సీజన్ కారణంగ అనేక పెద్ద కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు జరుగుతోంది. దీనికి ముందు క్లౌడ్ ఆధారిత సాఫ్ట్‌వేర్ సంస్థ సేల్స్‌ఫోర్స్ కూడా తన వర్క్‌ఫోర్స్‌లో 10 శాతం మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు ప్రకటించింది. అయితే Vimeo 11 శాతం మందిని తొలగించనుంది. దాదాపు 11,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మెటా కూడా ప్రకటించింది.