
ఏపీలో జనసేన మీద ఆధారపడాలి..
బీజేపీకి తెలంగాణలో, ఏపీలో జనసేన మిత్ర పక్షంగా ఉంది. తెలంగాణలో ముఖ్యమైన స్థానాల్లో పోటీచేసే సమయంలో జనసేన దూరంగా ఉంటే బీజేపీ పోటీకి దిగేది. తర్వాత మాటా మాటా పెరిగి ఇరుపార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. అలాగే ఏపీలోను బీజేపీకి మిత్రపక్షంగా జనసేన ఉంది. తెలంగాణకన్నా ఏపీలోనే జనసేన మద్దతు బీజేపీకి అవసరం. సరిగ్గా దీనిమీదనే కేసీఆర్ గురిపెట్టారు. బీజేపీకి ఏపీలో ఒకశాతం కూడా ఓటుబ్యాంకు లేదు. జనసేనతో కలుపుకుంటే 6 నుంచి 8 మధ్యలో ఓటుబ్యాంకు శాతం ఉంటుంది. తెలంగాణలో జనసేనమీద ఆధారపడాల్సిన అవసరం లేకపోయినా ఏపీలో మాత్రం ఆధారపడాలి. అందుకు తగ్గట్లుగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీ తన విశాఖ టూర్ లో పవన్ ను పిలిపించి మాట్లాడారు.

జనసేనను బలహీనం చేయాలని..
బీజేపీకి గిఫ్ట్ ఇవ్వాలంటే జనసేనను బలహీనం చేయడం మంచిదని కేసీఆర్ ఆలోచన. అందుకే ఆ పార్టీని బలహీనం చేసే ప్రక్రియను ప్రారంభించారు. కాపు సామాజికవర్గం మొత్తం జనసేనాని వెంట ఉందని అందరూ భావిస్తున్నారు. ఆ సామాజికవర్గాన్ని తన పార్టీదరికి చేర్చుకుంటే ఓటుబ్యాంకు దక్కుతుందని కేసీఆర్ ఆలోచన. పవన్ కు కుడిభుజంగా ఉన్న తోట చంద్రశేఖర్ తోపాటు మరికొందరు కాపు నాయకులు కూడా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎంత సాధ్యపడితే అంతవరకు కాపు ఓట్లను చీల్చగలిగితే రాష్ట్రంలో తనకు కావల్సిన ఓటుశాతం వస్తుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారు.

ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లవుతుందని..
తనకు బద్ధ శత్రువులుగా ఉన్న బీజేపీతోపాటు చంద్రబాబును కూడా దెబ్బకొట్టినట్లవుతుందనేది కేసీఆర్ యోచన. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మరిన్ని సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి తన బలాన్ని చాటబోతోంది. తెలుగుదేశం పార్టీ ఎంత యాక్టివ్ అయితే బీఆర్ఎస్ కు అంత దెబ్బ తగులుతుంది. ఆ విషయం తెలుసు కాబట్టే తెలంగాణమీద టీడీపీకి దృష్టిపెట్టే అవకాశం లేకుండా ఏపీ రాజకీయాలతోనే తలమునకలయ్యేంత అవకాశం కల్పించాలనేది బీఆర్ఎస్ భావన. తాజాగా కాపు ఓటుబ్యాంకు చీలిక వచ్చి వైసీపీకి లాభం కలుగుతుందనే అంచనాకు వస్తే తర్వాత ఏం చేయాలనే విషయమై చంద్రబాబు, పవన్ ఆలోచిస్తారు. తెలంగాణమీద దృష్టిసారించడం తగ్గుతందని కేసీఆర్ ప్రణాళికగా ఉంది. ఎవరి ప్రణాళికలు ఎలా ఉన్నా అన్నింటినీ ఓటరు మాత్రం మౌనంగా గమనిస్తున్నాడు.