ఆకాశానికి చికెన్ ధరలు..
కేజీ చికెన్ ధర మహా అయితే ఏ రూ.200లో ఉంటుంది. కానీ దాని రేటు రూ.650కి చేరటం ఇప్పుడు ఆందోళనకు కారణం అవుతోంది. అసలు ఈ రేట్లు మన దాయాది పాకిస్థాన్ లో ఉన్నాయి. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాక్ ఆర్థికం ఎంత దారుణంగా దిగజారిందనే విషయాన్ని ఈ ఒక్క విషయం ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర 10,000 పాకిస్థాన్ రూపాయలకు చేరుకోగా.. తాజాగా చికెన్ ధరలు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి.

లంక దారిలో దాయాది..
2022 అత్యంత కల్లోలాల్లో ఒకటి శ్రీలంక ఆర్థిక పతనం. దాని దారుణ పరిస్థితులను ప్రపంచం ఇంకా మరచిపోకముందే ప్రస్తుతం పాకిస్థాన్ అదే పతన మార్గంలో పయనిస్తోంది. కొత్త సంవస్సరం వచ్చిందన్న ఆనందం పాక్ ప్రజల్లో రోజుల వ్యవధిలోనే ఆవిరవుతోంది. ద్రవ్యోల్బణం రేటు ఆకాశానికి అంటుతున్న తరుణంలో.. ప్రాథమిక సౌకర్యాలు ప్రజలకు దూరం అవుతున్నాయి. ఇప్పుడు అక్కడ పూర్తిగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో త్వరలోనే మళ్లీ ఆర్మీ చేతికి ప్రభుత్వ పగ్గాలు వెళతాయా అనే ఆందోళనలు కూడా పెరుగుతున్నాయి.

చమురు సెగలు..
శ్రీలంక, పాకిస్థాన్ రెండింటి పతనంలో కొన్ని కామన్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి విదేశీ మారక నిల్వల కొరతతో ఏర్పడిన చమురు సంక్షోభం కాగా రెండవది వీటి వెనుక ప్రధాన కారణమైన చైనా రుణాలు. ఈ క్రమంలో దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోందని పాక్ రక్షణ మంత్రి స్వయంగా చెప్పారు. ఈ క్రమంలో అక్కడ ద్రవ్యోల్బణం డిసెంబర్ మాసంలో 24.5 శాతానికి చేరుకుని.. పెట్రోలు-డీజిల్, ఆహార పదార్థాలు, వంటగ్యాస్, కరెంటు ఇలా అన్నింటి రేట్లు ఆకాశానికి చేరుతున్నాయి. అలాగే పాక్ అప్పుల కుప్పలు కొండలా పేరుకుపోతున్నాయి.

ద్రవ్యోల్బణం పరుగులు..
పాకిస్థాన్ లో వినియోగదారుల ధరల సూచీ(CPI) డిసెంబర్‌లో 24.5 శాతానికి పెరిగింది. పాకిస్థాన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన డేటా ప్రాకారం.. ఏడాది కిందట సీపీఐ కేవలం 12.28 శాతంగా ఉంది. ఏడాది కాలంలో ఇది దాదాపుగా రెండింతలకు చేరుకుంది. అదే విధంగా పాకిస్థాన్‌లో ఆహార ద్రవ్యోల్బణం ఏడాది ప్రాతిపదికన 35.5 శాతం పెరిగింది. రవాణా ధరలు 41.2 శాతం, దుస్తులు పాదరక్షల ధరలు 17.1 శాతం పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఈ రేట్లతో సగటు పాకిస్థానీ బతకటం కష్టంగా మారిందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.