
సుప్రీం ధర్మాసనం..
దేశంలో కేంద్ర ప్రభుత్వం 2016లో అమలు చేసిన డీమానిటైజేషన్ నిర్ణయాన్ని సుప్రీం న్యాయమూర్తుల ధర్మాసనం సమర్థించింది. పెద్ద నోట్ల రద్దు సరైనదేనని తీర్పు వెలువరించింది. నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీం ఈ సందర్భంగా కొట్టేసింది. 2016 డిసెంబర్ 16న అప్పటి సీజేఐ టీఎస్ ఠాకూర్.. నమోదైన పిటిషన్ల విచారణను ఐదుగురు సభ్యుల బెంచ్ కు బదిలీ చేశారు. దీనీపై నేడు తీర్పు వెలువరిస్తూ.. డీమోనిటైజేషన్ ప్రక్రియను వెనక్కి తీసుకోలేమని, నోట్ల రద్దు ప్రక్రియ ప్రయోజనం ముఖ్యం కాదని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

రాజ్యాంగ లోపాలు..
కేంద్రం 2016లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయంలో ఎలాంటి రాజ్యాంగ లోపాలు లేవని కోర్టుకు తెలిపారు. దేశ పురోభివృద్ధిలో భాగంగానే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకోవటం జరిగిందని రిజర్వు బ్యాంక్ తన సమర్పణలో వెల్లడించింది. అయితే నిర్ణయం కొన్ని తాత్కాలిక ఇబ్బందులను కలిగించిందని.. అయితే తలెత్తిన సమస్యలను పరిష్కరించే యంత్రాంగం ఉందని తెలిపింది. రద్దు నిర్ణయం తీసుకోవటానికి 6 నెలల పాటు కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ మధ్య సంప్రదింపులు జరిగాయని జస్టిస్ గవాయ్ కోర్టుకు వెల్లడించారు.

నోట్ల రద్దు అందుకే..
నోట్ల రద్దు కసరత్తు బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని కేంద్రం కోర్టుకు వెల్లడించింది. ప్రధానంగా ఫేక్ కరెన్సీ, టెర్రర్ ఫైనాన్సింగ్, నల్లధనం, పన్ను ఎగవేతలను ఎదుర్కునే వ్యూహంలో భాగమని అఫిడవిట్‌లో కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనిపై ఎట్టకేలకు జనవరి 4న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ ఎస్‌ఎ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం నేడు తమ తీర్పును వెలువరించింది.

జస్టిస్ నాగరత్న..
RBI చట్ట ప్రకారం నోట్ల రద్దును భారతీయ రిజర్వు బ్యాంక్ బోర్డు నుంచి ఆవిర్భవించాల్సి ఉంటుంది. అయితే డీమానిజేషన్ సిఫార్సు చేస్తూ నవంబర్ 7న కేంద్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ కు లేఖ రాసింది. దీనిని సమర్థించిన జస్టిస్ నాగరత్న బెంచ్ లో భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో మెుత్తం ఐదుగురు బెంచ్ లో నలుగురు నోట్ల బ్యాన్ సమర్థించగా.. జస్టిస్ నాగరత్నం మాత్రం వారితో విభేదించారు. నోట్ల రద్దును గెజిట్ నోటిఫికేషన్ ద్వారా కాకుండా చట్టం లేదా ఆర్డినెన్స్ ద్వారా చేయాల్సి ఉంటుందని అసమ్మతి న్యాయమూర్తి జస్టిస్ నాగరత్న అన్నారు.