Editors Pick:2023 విజయ నామ సంవత్సరం.. ఎవరికంటే – లెక్క పక్కా..!
రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు కొత్త తలనొప్పి

2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణతో పాటు రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్నాటక, ఛత్తీస్‌గఢ్, త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి. అన్నీ సవ్యంగా సాగితే జమ్మూ కశ్మీర్‌లో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

ఈ క్రమంలోనే 2023లో ఆయా రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలు 2024కు ముందు సెమీ ఫైనల్స్‌గా పరిగణించొచ్చు.రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయితే ఈ ఏడాది హిమాచల్ ప్రదేశ్‌కు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయబాహుటా ఎగురవేయడంతో తిరిగి కాంగ్రెస్‌లో ఊపు వచ్చిందని చెప్పాలి.

ఇక రాజస్థాన్‌లో 2018లో కాంగ్రెస్ 100 సీట్లు గెల్చుకుని అధికారంలోకి వచ్చింది.2013లో బీజేపీ 163 సీట్లు గెల్చుకుంది. కానీ 2018 ఎన్నికల్లో మాత్రం కమలం పార్టీ 73 సీట్లకే పరిమితమైంది. ఇదిలా ఉంటే 2023లో మళ్లీ కాంగ్రెస్-కమలం పార్టీ మధ్య గట్టిపోటీ చూడొచ్చు. 1990 నుంచి రాజస్థాన్‌లో అధికారం బీజేపీ కాంగ్రెస్ మధ్య ఊగిసలాడుతూ వస్తోంది.ప్రస్తుతం అక్కడ సీఎం అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ల మధ్య విబేధాలు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది.

ఛత్తీస్‌గఢ్ మధ్య ప్రదేశ్‌లో..

ఛత్తీస్‌గఢ్ మధ్య ప్రదేశ్‌లో..

ఛత్తీస్‌గఢ్‌లో 90 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్ 2018లో 68 సీట్లు కైవసం చేసుకుని 15ఏళ్ల బీజేపీ పాలనకు చరమగీతం పాడింది.బీజేపీ కేవలం 15 సీట్లకే పరిమితమైంది.ఇక మధ్యప్రదేశ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైడ్రామా నడిచింది.అక్కడ కూడా బీజేపీ 15 ఏళ్ల పాలనకు చెక్ పెడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి కమల్‌నాథ్ సీఎం అయ్యారు. అయితే జ్యోతిరాదిత్య సింధియాతో పాటు మరో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కేవలం రెండేళ్లలోనే తిరిగి బీజేపీ అధికారం చేపట్టింది. మళ్లీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ సీఎం కుర్చీలో కూర్చున్నారు.

కర్నాటక పొలిటికల్ డ్రామా

కర్నాటక పొలిటికల్ డ్రామా

కర్నాటకలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ చేరుకోలేదు. దీంతో అక్కడ హంగ్ ఏర్పడింది. వెంటనే బీజేపీ నేత యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే మెజార్టీ నిరూపించుకోవడంలో విఫలమైన యడియూరప్ప రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ జేడీఎస్‌ల కలయికతో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

అయితే ఈ ప్రభుత్వం కూడా ఎంతో కాలం అధికారంలో లేదు. 14 నెలల్లోనే డజను మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం కూలిపోయింది. జూలై 2019లో బీఎస్ యడియూరప్ప సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే యడియూరప్పపై ఇటు పార్టీలో అటు ఎమ్మెల్యేలు వ్యతిరేక స్వరం పెంచడంతో బీజేపీ అధిష్టానం యడియూరప్పను సీఎం పదవి నుంచి తప్పించి బసవరాజ్ బొమ్మయ్‌ను ముఖ్యమంత్రి చేసింది.

అయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క కర్నాటకలోనే బీజేపీ ఉంది కాబట్టి ఈ రాష్ట్రాన్ని కమలం పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక కాంగ్రెస్‌కు కూడా కర్నాటక రాష్ట్రం చాలా ప్రతిష్టాత్మకం. ప్రత్యేకించి ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న మల్లికార్జున ఖర్గేకు ఇక్కడ ఎన్నికలు మరింత ఛాలెంజింగ్‌గా ఉంటాయి. మరి ఖర్గే ఎలాంటి పాచికలు పారిస్తారో,బీజేపీని ఢీకొట్టేందుకు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇక రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కర్నాటకలో మంచి స్పందన లభించింది. ఇది ఎంతమేరకు ఎఫెక్ట్ చూపుతుందనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ చర్చగా జరుగుతోంది.

కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ

కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ

తెలంగాణ ఆవిర్భావం నుంచి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ అధికారంలో ఉంది. ఇప్పుడు జాతీయ పార్టీగా అవతరించి భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్‌గా పేరు మార్చారు. ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ యుద్ధాన్ని ప్రకటించారు. ఇందుకోసం మోదీతో విబేధించే పార్టీలన్నిటినీ ఏకతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు గులాబీ బాస్.

ఈ మధ్యే జరిగిన మునుగోడు ఉపఎన్నికల్లో కారు పార్టీ సత్తా చాటింది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో కమలం పార్టీపై కాలు దువ్వేందుకు సిద్ధమైంది. అయితే కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో రాణించాలంటే ఏ పార్టీలు తనతో కలిసి వస్తాయనే అంశం ఆసక్తి కరంగా మారింది.మరోవైపు బీజేపీ కూడా తెలంగాణలో ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు తహతహలాడుతోంది. ఈ క్రమంలోనే షర్మిలా పార్టీతో పాటు టీడీపీతో కూడా కలిసే అవకాశముందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి.

అదే జరిగితే ఏపీలో ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుందనేది మరో చర్చగా నిలుస్తోంది. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్‌కు ఉమ్మడి శతృవు మోదీ కాబట్టి.. ఈ కాంగ్రెస్-బీఆర్ఎస్ చేతులు కలిపితే పరిస్థితేంటి.. రేవంత్ రెడ్డి పొలిటికల్ కెరీర్‌ ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది కూడా చాలా ఆసక్తికరంగా మారుతోంది.ఇక ఈశాన్య రాష్ట్రాల్లో చాలా సులభంగా పాగా వేసిన బీజేపీ వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో మాత్రం కాస్త చెమటోడ్చాల్సి ఉంటుంది. త్రిపురలో ప్రస్తుతం బీజేపీ సర్కార్ ఉంది.

అయితే అక్కడ తృణమూల్ కాంగ్రెస్ చాపకింద నీరులా విస్తరించడంతో కమలం పార్టీ అధికారంలోకి రావడం అంత ఈజీ కాదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యే త్రిపురా రాజధాని అగర్తాలాలో ప్రధాని మోదీ రూ.4350 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అంతేకాదు ఒక మెగా రోడ్‌షోలో కూడా ప్రధాని మోదీ పాల్గొన్నారు.

మొత్తానికి 2023లో తొమ్మిది రాష్ట్రాలకు జరిగే ఎన్నికలు 2024 సాధారణ ఎన్నికలపై కచ్చితమైన ప్రభావం చూపుతాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే విపక్షాలు ఒక్కటై బరిలోకి దిగుతాయా.. లేక కమలం పార్టీ ఏదైనా ప్రత్యేకమైన మంత్రం వేసి తిరిగి అధికారంలోకి వస్తుందా అని తెలియాలంటే వచ్చే ఏడాది వరకు వేచి చూడక తప్పదు.

Source link

Spread the love

Leave a Comment