
తగ్గనున్న హాల్ మార్క్ ఛార్జీలు:
ఏప్రిల్ 1 నుంచి బంగారం కొనుగోలు, అమ్మకందారులు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. 6 సంఖ్యలతో కూడిన హాల్ మార్క్ నంబరు(HUID) లేకుండా బంగారం కానీ, దానితో తయారు చేసిన ఆభరణాలను కానీ విక్రయించడాన్ని ప్రభుత్వం అనుమతించడం లేదు. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మైక్రోస్కేల్ యూనిట్లలో నాణ్యతా ప్రమాణాలను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇందుకోసం వివిధ ఉత్పత్తుల ధ్రువీకరణ రుసుములపై 80 శాతం రాయితీని అందించనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన నిన్న జరిగిన BIS రివ్యూ సమావేశంలో నిర్ణయించారు.

హాల్ మార్కింగుకు పెరుగుతున్న ఆదరణ:
ప్రస్తుతం 4, 6 అంకెల HUIDని వినియోగిస్తున్నట్లు ఆ శాఖ అదనపు కార్యదర్శి నిధి ఖరే తెలిపారు. టెస్టింగ్ ఇన్ఫాస్ట్రక్చరును పెంపొందించాలని మంత్రి ఆదేశించినట్లు వెల్లడించారు. నాణ్యమైన ఉత్పత్తుల కోసం వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతోందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా హాల్ మార్క్ బంగారు ఆభరణాలు విపరీతంగా అమ్ముడుతున్నట్లు చెప్పారు. హాల్ మార్కింగ్ తప్పనిసరి కాని జిల్లాల్లోనూ ప్రజలు దీని గురించి ఎంక్వయిరీ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఏమిటీ హాల్ మార్కింగ్:
హాల్ మార్కింగ్ అనేది విలువైన లోహాలకు సంబంధించిన స్వచ్ఛత దృవీకరణకు గుర్తు. జూన్ 2021లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్.. బంగారు ఆభరణాలకు హాల్ మార్కింగును తప్పనిసరి చేసింది. అనంతరం దశలవారీగా ఇప్పటి వరకు దేశంలోని 288 జిల్లాల్లో ప్రభుత్వం ఈ నిబంధన అమలవుతోంది. కాగా మరిన్నింటిని ఈ జాబితాలో జోడించనుంది.

HUID:
హాల్ మార్క్ యునిక్ ఐడెంటిఫికేషన్ నంబర్(HUID) అనేది ఆరు అంకెలతో కూడిన ఆల్ఫా న్యూమరిక్ సంఖ్య. జూలై 1, 2021న మొదటిసారిగా దీనిని ప్రవేశపెట్టారు. హాల్ మార్కింగ్ సమయంలో ప్రతి ఆభరణానికీ ఓ ప్రత్యేక HUID ఇవ్వబడుతుంది. అస్సేయింగ్ & హాల్ మార్కింగ్ సెంటర్(AHC)లో మాన్యువల్ గా ఆభరణాలపై ఈ నంబరు స్టాంప్ చేయబడుతుంది