కొచ్చర్ కు బెయిల్..
ఐసీఐసీఐ బ్యాంక్ రుణ మోసం కేసులో మాజీ సీఈవో, ఎండీ చందా కొచ్చర్; ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లకు బాంబే హైకోర్టు ఈ రోజు పెద్ద రిలీఫ్ ఇచ్చింది. వీరిద్దరికీ ఒక్కొక్కరికీ లక్ష రూపాయల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. ఈ అరెస్టును బాంబే హైకోర్టు ప్రశ్నిస్తూ.. నిబంధనల ప్రకారం అరెస్టు జరగలేదంటూ కోర్టు పేర్కొంది.

చందా కొచ్చర్ వాదన..
చందాకొచ్చర్ ను విచారణకంటూ పిలిచి అనుకోకుండా ఆమెను అరెస్ట్ చేశారని ఆమె తరఫున లాయర్లు అమిత్ దేశాయ్, కుశాల్ మోర్ కోర్టుకు తెలిపారు. దీపక్ కొచ్చర్ వ్యాపారాల్లో ఏం జరుగుతుందనే విషయాలు చందా కొచ్చర్ కు తెలియవని వారు కోర్టుకు వెల్లడించారు. చందా కొచ్చర్ ను ఒక పురుష అధికారి అరెస్ట్ చేశారని.. ఆ సమయంలో మహిళా అధికారి అక్కడ లేరని తన పిటిషన్లో కొచ్చర్ లాయర్లు వెల్లడించారు. ఇది నిబంధనలకు విరుద్ధమైన చర్య అని చందా కొచ్చర్ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

అరెస్ట్ ఎందుకు..
వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు బ్యాంక్ మంజూరు చేసిన రుణాల్లో మోసం, అవకతవకలకు సంబంధించిన కేసులో ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్‌లను అకస్మాత్తుగా ఈడీ అధికారులు ప్రశ్నించాలంటూ అదుపులోకి తీసుకున్నారు. ఇదే క్రమంలో వీడియోక్ గ్రూప్ అధినేత వేణుగోపాల్ ధూత్ ను సైతం ఈడీ తన కస్టడీకి తీసుకుంది. దీపక్ కొచ్చర్ కంపెనీల్లో పెట్టుబడులు, ముంబైలో ఖరీదైన ఆస్తిని తక్కువకు విక్రయం వంచి విషయాలపై లోతుగా అధికారులు వారిని ప్రశ్నించారు. పైగా దర్యాప్తు పరిధిని సైతం ఈడీ పెంచింది.

ED వాదన ఏమిటి..?
సెప్టెంబర్ 7,2009న ఐసీఐసీఐ బ్యాంక్ వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌కు రూ.300 కోట్ల రుణం మొత్తంలో కేవలం రూ.283.45 కోట్లను మాత్రమే బదిలీ చేసిందని ఈడీ కోర్టుకు వెల్లడించింది. మరుసటి రోజే.. సుప్రీమ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రూ.64 కోట్ల కొచ్చర్ కుటుంబ సంస్థ అయిన రెన్యూవబుల్ పవర్ కంపెనీకి బదిలీ చేయబడ్డాయని వెల్లడించింది. సుప్రీమ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌ని ధూత్ ప్రారంభించారు. తర్వాత నియంత్రణను దీపక్ కొచ్చర్‌కు అప్పగించినట్లు తెలిపారు.