సిస్కో తొలగింపులు..
ప్రపంచంలోనే అతిపెద్ద నెట్‌వర్కింగ్ సేవల సంస్థ సిస్కో తన బే ఏరియా కార్యాలయంలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో దాదాపుగా 700 మంది ఉద్యోగులు బలికానున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రధానంగా గత నవంబర్ లో శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయాల్లో దాదాపు 80 మంది ఉద్యోగులను తొలగించింది.

పునర్నిర్మాణం..
Cisco తన వ్యాపార పునర్నిర్మాణంలో భాగంగా మొత్తం 673 మంది ఉద్యోగులను తొలగించిందని SFGATE సంస్థ ప్రచురించింది. తాజా ప్రకటనతో Amazon, Salesforce, Meta, Twitter, Uber వంటి ఇతర టాప్ టెక్ కంపెనీల జాబితాలో Cisco కూడా చేరింది. ఎక్కువ మంది టెక్ ఉద్యోగులను తొలగించిన టాప్ టెక్ కంపెనీల జాబితాలో సిస్కో కూడా చేరటం ఆందోళనలకు అద్ధం పడుతోంది.

కీలక వ్యక్తుల తొలగింపు..
సిస్కో తన ప్రధాన కార్యాలయంలోనే ఇద్దరు వైస్ ప్రెసిడెంట్లతో సహా 371 మంది టెక్ ఉద్యోగులను తొలగించిన విషయాన్ని SFGATE శుక్రవారం ఒక ప్రకటన ద్వారా వెల్లడించింది. దీనికి తోడు కంపెనీ తనకు ఉన్న మిల్‌పిటాస్ కార్యాలయంలోని 222 మంది ప్రైమరీ ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బందిని తొలగించింది. అయితే ఈ తొలగింపులు ఇక్కడితో ఆగిపోతాయా లేక భవిష్యత్తులోనూ కొనసాగుతాయా అనే ఆందోళనలు ఉద్యోగులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.

నెట్‌వర్కింగ్ విభాగం..
నెట్‌వర్కింగ్ కింగ్ సిస్కో నవంబర్‌లో తన వర్క్‌ఫోర్స్‌లో 5 శాతం లేదా 4,000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తగ్గించనున్నట్లు ప్రకటించింది. అందులో భాగంగా తొలివిడతగా కేవలం బే ఏరియా కార్యాలయంలోనే 700 మందిపై కత్తికట్టింది. సిస్కో యునైటెడ్ స్టేట్స్ వెలుపల దాని గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో 52 శాతానికి పైగా ఉంది. ఇప్పటివరకు ఎంత మంది ఉద్యోగులను తొలగించారో సిస్కో అధికారికంగా వెల్లడించలేదు.