
మంచి ఫ్యామిలీ
బెంగళూరులోని కొడిగేహళ్లిలో లీలావతి (50) అనే మహిళ నివాసం ఉంటున్నది. లీలావతి భర్త ఇంజనీరు. లీలావతి కుమార్తె డాక్టర్ గా ఉద్యోగం చేసోంది. లీలావతి కుమారుడు ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తున్నాడు. ఇంటిలో భర్త, కూతురు, కొడుకు ప్రతినెల లక్షల్లో సంపాధిస్తుంటే లీలావతి ఇంటి దగ్గరే ఉంటున్నది. లీలావతి కూడా విద్యావంతురాలే.

షేక్ సలామ్ బజ్జీ సెంటర్
బెంగళూరులోని బ్యాటరాయణపూర్‌లోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం సమీపంలోని షేక్ సలాం అనే వ్యక్తి నిర్వహిస్తున్న బజ్జీ దుకాణానికి వెళ్లిన లీలావతి తనకు బజ్జీలు పార్శిల్ ఇవ్వాలని చెప్పింది. ప్రతిసారీ తాను ఫ్రీగా బజ్జీలు, బొండాలు ఇవ్వనని రూ. 100 ఇస్తే బజ్జీలు పార్శిల్ కట్టి ఇస్తానని యజమాని షేక్ సలామ్ లీలావతికి చెప్పాడు. నీకు ఎంత ధైర్యం రా, ‘పోలీసులనే డబ్బులు అడుగుతున్నావా అంటూ షేక్ సలామ్ మీద లీలావతి చిందులు వేసింది.

హలో 112…. త్వరగా రండిసార్
లీలావతి తీరుతో విసిగిపోయిన షేక్ సలాం ఆమె టార్చర్ భరించలేక పోలీసు హెల్ప్‌లైన్ 112కు ఫోన్ చేసి ఇక్కడ తాను లేడీ పోలీసు అంటూ ఓ మహిళ నానా హంగామా చేస్తోందని, మీరు వెంటనే రావాలని సమాచారం ఇచ్చాడు. షేక్ సలామ్ పోలీసు హెల్ప్‌లైన్‌కు కాల్ చేశాడని తెలుసుకున్న లీలావతి నీకథ రేపు చూస్తా ఉండూ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్దం అయ్యింది.

రోజూ టార్చర్ పెడుతోంది సార్
లీలావతి వెళ్లిపోవడానికి ప్రయత్నించడంతో షేక్ సలామ్ ఆమెను అడ్డుకున్నాడు. లీలావతి, షేక్ సలామ్ మధ్య వాగ్వివాదం జరుగుతున్న సమయంలో 112 సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లారు, వెంటనే పోలీసులు లీలావతిని అదుపులోకి తీసుకుని విచారించగా ఆమె నకిలీ పోలీసు అని తేలింది. కొడిగేహళ్లి, బ్యాటరాయణపురంలోని పలు చోట్ల గత ఏడాది కాలంగా బేకరీలులో తినుబండారాలు, కూరగాయల వ్యాపారుల దగ్గర కూరగాయాలు, బజ్జీల అంగడిలో బజ్జీలు, బొండాలు ఫ్రీగా తినేస్తోందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

ఫ్రీగా బిర్యానీలు తినేసి ఇంటికి మళ్లీ పార్శిల్
లేడీ పోలీసు అధికారి అని చెప్పుకుంటూ గత ఏడాది కాలంగా చిరు వ్యాపారులను బెదిరించి బజ్జీలు, బొండాలు, కూరగాయలు ఫ్రీగా తీసుకు వెలుతోందని, హోటల్స్ లో బిర్యానీలు, కబాబ్ లు తింటున్న లీలావతి ఇంటికి పార్శిల్ తీసుకెలుతోందని తెలుసుకున్న పోలీసు అధికారులు హడలిపోయారు. కిలాడీ లేడీ లాలీవతిని బ్యాటరాయణపుర పోలీసులు అరెస్టు చేశారు. లీలావతి కొడుకు టెక్కీ, కూతురు డాక్టర్, భర్త ఇంజనీరు అని తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు. అయితే లీలావతి ఎందుకు ఇలా చేస్తోందో ? అనే విషయం అర్థంకావడంలేదని, ఆమె గురించి కుటుంబ సభ్యుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నామని పోలీసులు తెలిపారు.