
కంపెనీ ప్రకటన..
యునైటెడ్ స్టేట్స్‌లోని మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు కొత్త “Discretionary Time Off” విధానం ప్రకారం వచ్చే వారం నుంచి అపరిమితమైన సమయాన్ని తమ వెకేషన్ కోసం తీసుకోవచ్చని తెలుస్తోంది. దీనికి సంబంధించి టెక్ దిగ్గజం ఇప్పటికే అంతర్గత మెమో జారీ చేసినట్లు ది వెర్జ్ వెబ్‌సైట్ ఒక వార్తా కథనంలో వెల్లడించింది.

పాలసీ రూల్స్..
మైక్రోసాఫ్ట్ తీసుకొస్తున్న ఫ్లెక్సిబుల్ లీవ్ పాలసీ గంటల ఆధారంగా పనిచేసే ఉద్యోగులకు, అమెరికా బయట దేశాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తించదని తెలుస్తోంది. ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఉండే చట్టాలు, నియమాలు వేరువేరుగా ఉంటాయి కాబట్టి ప్రస్తుతం ఈ విధానాన్ని అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది.

కొత్త ఉద్యోగులకు..
టెక్ దిగ్గజం తెచ్చిన రూల్స్ జనవరి 16 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ కొత్త నిబంధనల్లో అపరిమిత సెలవు దినాలు అలాగే 10 కార్పొరేట్ సెలవులు, అనారోగ్యం, మరణానికి సెలవులు, జ్యూరీ డ్యూటీ సెలవులు కూడా ఉన్నాయి. అలాగే కొత్త ఉద్యోగులు తమ వెకేషన్ రోజుల కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని వెల్లడైంది. అలాగే వినియోగించుకోని సెలవులకు కంపెనీ ఏప్రిల్‌లో చెల్లింపు సౌకర్యాన్ని అందుబాటులో ఉంచినట్లు సమాచారం.

కంపెనీ ప్రతినిధి..
ప్రస్తుత తరుణంలో పని స్వభావం తీవ్రంగా మారినందున, మరింత సౌకర్యవంతమైన సెలవు విధానం కంపెనీని సహజమైన తదుపరి దశకు తీసుకెళ్తుందని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ కాథ్లీన్ హొగన్ వెల్లడించారు. కరోనా మహమ్మారి తర్వాత మారుతున్న పరిస్థితుల్లో ఫ్లెక్సిబుల్ వెకేషన్ పాలసీని మైక్రోసాఫ్ట్ అందుబాటులోకి తీసుకురాటం గమనార్హం. ఉద్యోగులు సైతం దీనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యోగులకు బోనస్..
కంపెనీ 2021లో అమెరికాలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రమే కాక అంతర్జాతీయంగా పనిచేస్తున్న వారికి 1,500 డాలర్ల బోనస్ కూడా ప్రకటించింది. అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంపై క్లారిటీ ఇస్తూ.. ఉద్యోగులు ఆఫీసులకు రావటమే సరైనదని తెలిపింది. దీనివల్ల మంచి వర్క్ కల్చర్ ఏర్పడుతుందని కంపెనీ భావిస్తోంది. అనేక దేశాల్లో కంపెనీలు పిల్లలు పుట్టిన సమయంలో తండ్రులకు కూడా సెలవులు అందిస్తున్నాయి.