రిపబ్లిక్ డే వేడుకలలో పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర ,జిల్లా కార్యవర్గ సభ్యులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 సంవత్సరాలు అవుతున్న తరుణంలో, నేటికీ రాజ్యాంగ ఫలాలు నోచుకోని ప్రజలకు అందేలా శాసన, న్యాయ, రక్షణ వ్యవస్థలు పారదర్శకంగా కృషి చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు జనసేన ట్విట్టర్ అఫీషియల్ వేదికగా పేర్కొంది.
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు
ఇదిలా ఉంటే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసిన ఆయన భారత దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన రాజ్యాంగ పరిరక్షణ కోసం స్వాతంత్య్ర ఉద్యమ స్పూర్తితో పోరాడుదాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం. జై హింద్! అని పేర్కొన్నారు.
దేశద్రోహులను తరిమికొట్టేందుకు ఈ పవిత్రదినాన ప్రతినబూనుదాం : టీడీపీ పోస్ట్
ఇక మరో వైపు తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా చేసిన పోస్ట్ ద్వారా ఏపీలో అధికార పార్టీని పరోక్షంగా టార్గెట్ చేసింది. ‘రాజ్యాంగం పరిధిలో ఏవైనా దోషాలు దొర్లితే.. అది రాజ్యాంగ లోపం కాదు. కచ్చితంగా మానవ తప్పిదమే’ అన్నారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్. ప్రజల స్వేచ్ఛ, హక్కులను హరించడం అంటే రాజ్యాంగాన్ని అవహేళన చేయడమే.
అటువంటి దేశద్రోహులను తరిమికొట్టేందుకు ఈ పవిత్రదినాన ప్రతినబూనుదాం అంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. దేశభక్తుల ఆశయాలను నెరవేర్చమని, రాజ్యాంగ పరిరక్షణకు నడుంబిగిద్దామని పేర్కొంది.