డేటా సెంటర్లు..
మైక్రోసాఫ్ట్ ఇండియాలో నాలుగు పెద్ద డేటా సెంటర్లను ఏర్పాటు చేసేందుకు భారీగా పెట్టుబడి పెట్టింది. దేశ ప్రజల డేటాను కంపెనీలు ఇండియాలోనే స్టోర్ చేయాలని చెప్పటంతో చాలా కంపెనీలు డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన సత్యనాదెళ్ల భారత సాంకేతిక పురోగతిని కొనియాడారు. యునికార్న్‌లు మాత్రమే కాక.. చిన్న కంపెనీలు, స్టార్టప్స్, ప్రభుత్వ కంపెనీలు, బహుళజాతి కంపెనీలు కూడా సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నాయన్నారు. డిజిటల్ వినియోగంతో ఆధార్, యూపీఐ వంటి సేవలు ప్రజల జీవితాన్ని సులభతరం చేశాయన్నారు.

హైదరాబాద్ జన్మించి..
ప్రస్తుతం ఇండియాలో నాలుగు రోజుల పర్యటనలో సత్యనాదెళ్ల ఉన్నారు. అయితే ఆయన మన తెలుగువాడు కావటం అందులోనూ హైదరాబాదీ అని చాలా మందికి తెలియదు. 55 ఏళ్ల నాదెళ్ల.. 47 ఏళ్ల చరిత్ర కలిగిన మైక్రోసాఫ్ట్ కంపెనీకి మూడో సీఈవో కావటం గమనార్హం. భారత్ లో నైపుణ్యం కలిగిన వ్యక్తుల రేటు ప్రపంచ రేటు కంటే రెండింతలుగా ఉందని ఆయన అన్నారు. అందుకే కంపెనీలు ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలంగా ఉన్నాయి. పైగా ప్రపంచం కంటే భారత్ రెండింతలు వేగంగా పరిగెడుతోందని అభిప్రాయపడ్డారు.

భారత్ పై నమ్మకం..
ప్రపంచంలో ఆపిల్, సౌదీ అరామ్‌కో తర్వాత మైక్రోసాఫ్ట్ మూడో అత్యంత విలువైన కంపెనీ. దీని మార్కెట్ విలువ దాదాపు రూ.1.79 ట్రిలియన్ డాలర్లు. కంపెనీకి ఇండియాపై ఇంత నమ్మకం ఉండటానికి చాలానే కారణాలు ఉన్నాయి. భారత్ లో స్టార్టప్‌లు గతంలో ఎన్నడూ చేయని పనులు చేస్తున్నాయి. జీడీపీ వృద్ధి శాతంలో టెక్నాలజీ వాటా చాలా పెరిగిందని ఆయన అన్నారు. మైక్రోసాఫ్ట్ రిలయన్స్ జియో కోసం డేటా సెంటర్లను నిర్మించడానికి వారితో చేతులు కలిపింది. పైగా కంపెనీ అదానీ, టాటాలతో కూడా కలిసి పనిచేస్తోంది.

గూగుల్ కి పోటీగా..
సెర్చ్ ఇంజన్ వ్యాపారంలో గూగుల్ తిరుగులేని కంపెనీగా కొనసాగుతోంది. అయితే ఈ ఆధిపత్యాన్ని దాటి లాభపడాలని మరో అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కొత్త ప్రణాళికతో ముందుకు వచ్చింది. దీనికోసం మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజిన్ Bing కొత్త వెర్షన్‌ను పరిచయం చేయాలని చూస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి కస్టమర్లకు మెరుగైన సేవా అనుభూతిని అందించాలని కంపెనీ నిర్ణయించింది. అయితే ఇది గూగుల్ ను వెనక్కు నెట్టగలదా.. కంపెనీ కావాలనుకున్నంత పాపులర్ అవుతుందా అనే విషయాలు రానున్న కాలంలో వేచిచూడాల్సిందేనని టెక్ నిపుణులు చెబుతున్నారు.