
స్విగ్గీ పరిస్థితి..
ఫుడ్ అండ్ గ్రోసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ 2022లో భారీగానే నష్టాలను నమోదు చేసింది. 2022 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఏకంగా రూ.3,628.9 కోట్లను నష్టపోయిందని బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్ టోఫ్లర్ యాక్సెస్ చేసిన ఆర్థిక డేటా ప్రకారం వెల్లడైంది. దీనికి ముందు సంవత్సరం కంపెనీ నష్టాలు రూ.1,616.9 కోట్లుగా ఉంది. అంటే ఒక్క సంవత్సర కాలంలో కంపెనీ నష్టాలు దాదాపుగా రెండితలయ్యాయి.

ఆదాయాలు ఇలా..
మార్చి 2022తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి వ్యాపార కార్యకలాపాల ద్వారా స్విగ్గీ రూ.5,704.9 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇది గత ఏడాది కాలంలో రూ.2,546.9 కోట్లుగా ఉంది. సమీక్షలో ఉన్న ఆర్థిక సంవత్సరంలో దాని మొత్తం ఆదాయం ఏడాది క్రితం రూ.2,675.9 కోట్ల నుండి రెండు రెట్లు పెరిగి రూ.6,119.8 కోట్లకు చేరుకుంది. కరోనా తర్వాత వ్యాపార పునరుద్ధరణ, విస్తరణపై దృష్టి సారించినట్లు కంపెనీ వెల్లడించింది.

జొమాటో రాజీనామాలు..
మరో పక్క ఫుడ్ డెలివరీ జెయింట్ జొమాటోలో వ్యవస్థాపకులు ఒక్కొక్కరుగా కంపెనీని విడిచిపెట్టడం ఆందోళనను కలిగిస్తోంది. సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా కంపెనీని విడిచిపెట్టిన కొన్ని వారాలకే మరో రాజీనామా జరిగింది. తాజాగా జనవరి 2, 2023న జొమాటో సహ వ్యవస్థాపకుడు, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ (CTO) గుంజన్ పాటిదార్ కూడా కంపెనీని వీడారు. ఆయన కంపెనీలో దాదాపుగా 14 సంవత్సరాలు పనిచేసినట్లు తెలుస్తోంది.

షేర్ పరిస్థితి..
2010లో ప్రారంభించబడిన జొమాటో ప్రస్తుతం దాదాపుగా 4204 మంది ఉద్యోగులను కలిగి ఉంది. ఈ కంపెనీ కొవిడ్ సమయంలో ఐపీవోగా మార్కెట్లోకి వచ్చింది. అయితే తొలుత స్టాక్ మంచి పనితీరు కనబరిచినప్పటికీ.. దాని ఆర్థిక పరిస్థితులు మెరుగుపడకపోవటం, కంపెనీ లాభాల బాట పట్టకపోవటంతో ఇన్వెస్టర్ల నమ్మకాన్ని పోగొట్టుకుంది. ఈ రోజు ఉదయం 9.40 గంటల సమయంలో స్టాక్ ధర ఎన్ఎస్ఈలో రూ.59.40 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.142.45 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.40 వద్ద ఉంది.