ఐపీవో వివరాలు..
టాటా మోటార్స్ అనుబంధ సంస్థ అయిన టాటా టెక్నాలజీస్ కంపెనీని ఐపీవోగా మార్కెట్లోకి తీసుకురావాలని గ్రూప్ నిర్ణయించింది. అయితే ఇది 19 ఏళ్ల తర్వాత టాటాల నుంచి మార్కెట్లోకి వస్తున్న ఐపీవో కావటం విశేషం. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.3,500 నుంచి రూ.4,000 కోట్లను సమీకరించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ఇష్యూ తర్వాత కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ దాదాపు రూ.16,200 కోట్ల నుంచి రూ.20,000 కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. దీనిని కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ఇప్పటికే టాటాలు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు మూలాల ప్రకారం తెలుస్తోంది.

క్రమంగా పెరుగుదల..
గత నెలలో టాటా మోటార్స్ బోర్డు IPO ద్వారా టాటా టెక్‌లో కొంత వాటాను విక్రయించే ప్రతిపాదనను ఆమోదించింది. అప్పటి నుంచి కంపెనీకి చెందిన అన్‌లిస్టెడ్ షేర్లు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం టాటా సన్స్ చైర్మన్‌గా ఉన్న ఎన్ చంద్రశేఖరన్ హయాంలో టాటా గ్రూప్‌కి ఇదే తొలి ఐపీవో కావటం విశేషం. అయితే కంపెనీ IPO కోసం ఇంకా ఎటువంటి తేదీని నిర్ణయించలేదు. కంపెనీలో టాటా మోటార్స్ 74.42 శాతం, ఆల్ఫా టీసీ 8.96 శాతం, టాటా క్యాపిటల్ గ్రోత్ ఫండ్ 4.48 శాతం వాటా కలిగి ఉన్నాయి.

చివరిగా 2004లో..
దేశంలోని పురాతన వ్యాపార సామ్రాజ్యమైన టాటా గ్రూప్ చివరిగా 2004లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(TCS) IPOను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం దేశంలోని రెండవ అత్యంత విలువైన కంపెనీగా టీసీఎస్ ఎదిగింది. టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,233,082.02 కోట్లుగా ఉంది. ఇక మెుదటి స్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ రూ.1,671,800.07 కోట్లుగా ఉంది.