
ఇంట్లో పూజగదిలో విగ్రహాలు పెట్టే విషయంలో జాగ్రత్త
పూజగది విడిగా ఉన్నా, పూజగది లేకున్నా విగ్రహాలను పెట్టే విషయంలో గృహస్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ దేవుళ్ల విగ్రహాలను చాలా చిన్నగా ఉన్న వాటిని పెట్టుకోవాలి. విగ్రహాల ఎత్తు ఎక్కువగా ఉంటే కచ్చితంగా ఆ విగ్రహాలకు రోజు మహా నివేదన చెయ్యాలి. వారంలో ఒక్కసారైనా అభిషేకం నిర్వహించాలి. ప్రతి రోజూ పూజలు చేయకుండా పెద్ద విగ్రహాలను ఇళ్ళల్లో ఉంచుకోకూడదు. అలా పెద్ద విగ్రహాలు ఇంట్లో పెట్టి నిత్య పూజలు, నివేదన చెయ్యకుంటే మంచిది కాదని చెప్తారు.

ఆ దేవుళ్ళ విగ్రహాలు ఇలా ఉంటే పంపకూడదు
ఇక ప్రత్యేకంగా దేవుని పూజ గది లేని వారు పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఎట్టి పరిస్థితులలోనూ ఇంట్లో పెట్టుకోకూడదు. పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను కూడా పెట్టుకోకూడదు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి ఫోటోలు కానీ విగ్రహాన్ని కానీ ఇంట్లో పెట్టుకోకూడదు. లక్ష్మీ నరసింహ , యోగ నరసింహ లేదా ప్రహ్లాద అనుగ్రహ నరసింహ స్వామి ఫోటో పెట్టి పూజలు చేసుకోవచ్చు. చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు. కృష్ణుడు విగ్రహం ఆవుతో ఉన్న ఫోటో కానీ, చిన్న పరిమాణంలో ఉన్న విగ్రహం కానీ పెట్టుకోవచ్చు.

పొరబాటున కూడా ఈ దేవతల ఫోటోలు, విగ్రహాలు పెట్టకండి
పొరపాటున కూడా కాళికా దేవి, ప్రత్యంగిరా దేవి ఫోటోలను ఇంట్లో పెట్టుకోకూడదు. ఇంట్లో నటరాజ స్వామి విగ్రహాన్ని పెట్టుకోకూడదు. నాట్యం నేర్పే ప్రదేశంలో నిత్యం నాట్య నివేదన జరుగుతుంది కాబట్టి అక్కడ నటరాజ స్వామి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. సూర్యుడు విగ్రహాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంట్లో పెట్టకూడదు .ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా కనిపిస్తారు కాబట్టి నేరుగా నమస్కరించాలి.

ఇంటి గుమ్మం ముందు ఇవి పెట్టకండి
అంతేకాదు ఇంటి గుమ్మానికి దిష్టి కోసం రాక్షసులు ఫోటోలను పెట్టకూడదు. దీనివల్ల ఇంటి యజమాని తరచూ అనారోగ్యం పాలవుతుంటారు. ఇంటి గుమ్మం వద్ద వినాయకుడు ఫోటో కానీ, దిష్టి యంత్రాన్ని కానీ, కాళీ పాదం ఫోటోనుగానీ పెట్టడం మంచిదని సూచించబడింది. ఇక ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం ముందు గాని ఫోటో ముందు గాని ఒక చిన్న గిన్నెలో బియ్యం అందులో కొన్ని గవ్వలు వేసి ఉంచాలి. లక్ష్మీదేవి ముందు పెట్టే గిన్నె వెండి గిన్నె అయితే మరీ మంచిది. ఇక ఈ నియమాలను పాటించకుండా లక్ష్మీదేవి విగ్రహాలను పెట్టకూడదు.

విగ్రహాలు పూజించకుంటే ఇంట్లో ఉంచటం మంచిది కాదు
ఇంట్లో ఎక్కడా లక్ష్మీదేవి నిలుచుని ఉన్నట్లుగా విగ్రహం ఉండకూడదు. పచ్చ రంగు చీర తో లక్ష్మీ దేవి కూర్చొని అటూ ఇటూ ఏనుగులు ఉన్నట్లుగా ఉన్న ఫోటోకి గృహస్థులు పూజ చేయడం మంచిదని సలహా ఇవ్వబడింది. ఇక ఇళ్లల్లో నిత్యం పూజలు చేస్తూ పూజగదిలో పెట్టే విగ్రహాలను పూజ గది నుండి తీసివేయవలసి వస్తే, వాటిని వేరే గదులలో పెట్టడం మంచిది కాదు. ఆ విగ్రహాలను నేరుగా ఆలయాలకు తీసుకువెళ్లి గుళ్ళలో పెట్టడం మంచిదని సూచించబడింది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది.