
జొమాటో స్కామ్..
తాజాగా తనకు ఎదురైన అనుభవాన్ని ఒక వ్యక్తి లింక్డ్ ఇన్ ఖాతా ద్వారా జొమాటో వ్యవస్థాపకుల దృష్టికి తీసుకెళ్లాడు. జొమాటోలో ఫుడ్ డెలివరీ ఏజెంట్లు చేస్తున్న మోసం గురించి అందులో స్పష్టంగా వివరిస్తూ ఒక పోస్ట్ సైతం చేశాడు. ఆన్ లైన్ ఆర్డర్లను డెలివరీ ఏజెంట్లు ఎలా సొమ్ము చేసుకుంటున్నారనే కుంభకోణాన్ని వెలుగులోకి తెచ్చాడు.

మోసం ఇలా..
వినయ్ సాతి తన పోస్టులో ఫుడ్-అగ్రిగేటర్‌ను డెలివరీ ఏజెంట్లు ఎలా మోసం చేస్తున్నారనే విషయాన్ని స్పష్టంగా వెల్లడించాడు. తాను ఒక బర్గర్ ఆర్డర్ చేశానని అందుకు గాను ఆన్ లైన్ పేమెంట్ చేసినట్లు వెల్లడించాడు. ఆ తర్వాత దానిని డెలివరీ చేసేందుకు వచ్చిన ఏజెంట్ తర్వాతి సారి నుంచి క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ పెట్టాలని సూచించినట్లు వెల్లడించాడు. ఎందుకని అడగగా.. క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా రూ.700-800 విలువైన ఆర్డర్ చేస్తే దానిని కేవలం రూ.200లకే పొందవచ్చని తెలిపినట్లు వెల్లడించాడు.

ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే..
ఇలా క్యాష్ ఆన్ డెలివరీలో ఎలా సాధ్యమని వినయ్ అడగగా.. డెలివరీ సమయంలో ఆర్డర్ డెలివరీ తీసుకోలేదని రిజెక్డ్ చేస్తామని, అయినప్పటికీ దానిని ఆర్డర్ పెట్టిన వారికి ఇస్తామని సదరు డెలివరీ ఏజెంట్ వెల్లడించాడు. ఇందుకు గాను వారికి కేవలం రూ.200-300 చెల్లిస్తే సరిపోతుందని చెప్పాడు. ఇది కంపెనీకి నష్టం కలిగిస్తుందని దీనిని ఫిక్స్ చేయాలని అతడు కంపెనీని కోరాడు. మీ తెలివైన IIM సిబ్బంది దీనికి పరిష్కారం కనుక్కోకుండా ఏం చేస్తున్నారంటూ అందులో అతడు ప్రశ్నించాడు.

సీఈవో ఏమన్నారంటే..
ఈ పోస్టుపై జొమాటో వ్యవస్థాపకుడు అయిన దీపేందర్ గోయల్ స్పందించారు. ఇలా జరుగుతున్నట్లు తమకు తెలుసునని బదులిచ్చాడు. అయితే ఈ లూప్ హోల్ ను సరిదిద్దేందుకు తాము కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. అసలే నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న స్టార్టప్ కంపెనీలో ఇలాంటి కుంభకోణాలు వెలుగులోకి రావటం కస్టమర్లను, ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. డెలివరీ ఏజెంట్లు తీరు చూసినవారు సైతం హవ్వా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.